‘పోలేరమ్మ జాతరలో పోతురాజు ఊగినట్టు’ ప్రపంచమంతా ‘నాటు నాటు’ పాటకు నీటుగా స్టెప్పులేస్తూ దుమ్మురేపుతున్నది. కామన్మ్యాన్ నుంచి సెలెబ్రిటీ వరకు ‘నా పాట సూడు.. నా ఆట సూడు..’ అంటూ పాదాలు కదిపి వైరల్ అయిపోతున్నారు. ఈ జాబితాలో తాజాగా పాకిస్థాన్ నటి హానియా ఆమిర్ వచ్చి చేరింది.
ఒక పెండ్లి వేడుకలో ‘నాటు నాటు’ పాటకు ఆమె వేసిన స్టెప్పులు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. షరారా డ్రెస్లో ఆమె నర్తించిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇరుదేశాల మధ్య వైరాన్ని ట్రిపుల్ ఆర్ ఛేదించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆస్కార్ నామినేషన్ జోరుతో నాటు నాటు పాట దేశవిదేశాల్లో మార్మోగుతున్నది.