కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథా చిత్రాల్ని ఎంచుకుంటూ ప్రతిభావంతుడైన హీరోగా పేరు తెచ్చుకున్నారు రానా. సినీరంగంలో ఆయన పన్నెండేళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు రానా. “లీడర్’ చిత్రంలో అర్జున్ప్రసాద్ పాత్ర నుంచి నేటి డేనియల్ ప్రసాద్ (త్వరలో విడుదలకాబోతున్న‘భీమ్లానాయక్’ చిత్రంలో రానా పోషిస్తున్న పాత్ర పేరు) వరకు ప్రయాణం ఎంతో సంతృప్తికరంగా సాగుతున్నది. అప్పుడే పుష్కరకాలం పూర్తయింది. నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ అందరి ఆదరణతో మున్ముందు కూడా కొత్త కథల్ని ఎంచుకుంటూ విభిన్నమైన పాత్రల్లో మెప్పిస్తాను’ అని ట్విట్టర్లో రానా పేర్కొన్నారు. ప్రస్తుతం రానా ‘భీమ్లానాయక్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకులముందుకు రానుంది.