దేశంలో హెల్త్‌కేర్ సెక్టార్ అత్యంత వేగంగా
అభివృద్ధి చెందుతున్న రంగం. ఈ సెక్టార్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతోపాటు తన సేవలను విస్తరిస్తుంది. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా హెల్త్ సెక్టార్ అవసరమైన బడ్జెట్‌ను కేటాయిస్తూ కార్పొరేట్ స్థాయిలో ముందుకు దూసుకుపోతుంది. ఈ క్రమంలో అధిక రెవెన్యూతో పాటు ఎక్కువ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ అతిపెద్ద రంగంగా అవతరిస్తుంది. హాస్పిటల్స్, హెల్త్‌కేర్ సెంటర్స్, మెడికల్ ఎక్విప్మెంట్, టెలిమెడిసిన్, మెడికల్ టూరిజం, హెల్త్ ఇన్సూరెన్స్, రిసెర్చ్ ల్యాబ్స్ వంటి విభాగాలు హెల్త్ కేర్ సెక్టార్లో ఉంటాయి. మొత్తం హెల్త్‌కేర్ మార్కెట్లో ఒక్క ఇండియా హెల్త్‌కేర్ సెక్టారే 80% మార్కెట్‌ను ఆక్రమించింది. హాస్పిటల్స్ క్లినికల్, నాన్ క్లినికల్ విభాగంలో అర్హులైన అభ్యర్థులకు అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. అయినా అవసరాలకు సరిపడా మానవవనరులు లేకపోవడంతో పెద్దఎత్తున నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఈ రంగానికి ఉంది. అభివృద్ధి చెందుతున్న హెల్త్‌కేర్ సెక్టార్‌తో పాటు కెరీర్ కూడా ఎదగాలంటే హస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌ను ఎంపిక చేసుకోవడం సరైన నిర్ణయం.
హాస్పిటల్లో జరిగే కార్యకలపాలన్నింటినీ కలిపి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌గా చెప్పవచ్చు. సౌకర్యాలు, ఆర్థిక విషయాలు, వివిధ విభాగాల్లో స్టాఫ్ పెంచడం, నాణ్యత కలిగిన ఆరోగ్య సంరక్షణను అందించడం, వివిధ విభాగాలు అందించే సేవలకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించడం, ప్రస్తుత చట్టాలకు అనుగుణంగా పాలసీలు రూపొందించి వాటిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు, మేనేజ్మెంట్కు తెలియజేయడం, బడ్జెట్ రూపకల్పన, లాజిస్టిక్స్, మెడికల్ బిల్స్, మార్కెటింగ్ తదితర విషయాలన్నింటిని నిర్వహించే బాధ్యత హస్పిటల్ అడ్మినిస్ట్రేటర్‌దే.
ఉపాధి అవకాశాలు హెచ్ఆర్ మేనేజర్స్
క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాలను కలిపి పర్యవేక్షించే కీలకమైన పాత్రను హెచ్ఆర్ మేనేజర్ నిర్వహించాల్సి ఉంటుంది. నర్సింగ్ డైరెక్టర్స్, మెడికల్ డైరెక్టర్స్, డిపార్ట్మెంట్ హెడ్స్‌ను నియమించాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ సెంటర్స్ నిర్వహణ, అవుట్ పేషెంట్స్‌కు అవరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలి. స్టాఫ్ సంరక్షణ కూడా మేనేజర్ బాధ్యతే. ఒక్కమాటలో చెప్పాలంటే హస్పిటల్ సజావుగా నడవడం అనేది హెచ్ఆర్ మేనేజర్‌పైనే ఆధారపడి ఉంటుంది.
సేల్స్ అండ్ మార్కెటింగ్: ఫైనాన్స్, అకౌంట్, మార్కెటింగ్‌కు సంబంధించిన విషయాలను హాస్పిటల్ మేనేజర్‌గా నిర్వహించాలి.
హాస్పిటల్ ఆపరేషన్స్: రోజువారీ జరిగే హాస్పిటల్ కార్యకలపాల్లో పాలుపంచుకోవడంతోపాటు ఒక్కో విభాగం పనితీరును పరిశీలించాల్సి ఉంటుంది.
అకడమిక్స్: హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసిన వారు వివిధ కాలేజీలు, యూనివర్సిటీల్లో హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు ఫ్యాకల్టీగా అవకాశాలు లభిస్తాయి.
హెల్త్ అనాలసిస్ట్: ఎక్కువగా ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించినదిగానే హెల్త్ యాక్చురీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ విభాగంలో మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ చేసివారికి కొంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ రంగంలో పనిచేయాలనుకున్న వారు ఫైనాన్షియల్ రిస్క్‌ను అంచనా వేయడం, మూల్యాంకనం చేసి తెలియజెప్పడం వంటివి చేయాల్సి ఉంటుంది.
హెల్త్ ప్రమోషన్ స్పెషలిస్టు: ప్రస్తుతం పబ్లిక్, ప్రైవేట్ హాస్పిటల్స్ రెండింటిలో వీరికి అవకాశాలుంటాయి. ఏదైనా ఒక అంశం పట్ల, వ్యాధుల పట్ల అవగాహన కలిగించడం వీరి పని. డ్రగ్స్‌ను దుర్వినియోగం చేయడం, ఆల్క్‌హాల్ వినియోగం అలాగే డెంగ్యూ, మలేరియా, క్యాన్సర్, హృద్రోగ తదితర అంశాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఈ విషయాలపై సీనియర్స్‌కు సైతం శిక్షణ తరగతులు, వర్క్‌షాపులు, కమ్యూనిటీ క్యాంపెయిన్ వంటివి నిర్వహించవలసి ఉంటుంది. పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ చేసినవారికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కొంత అనుభవం సంపాదించిన తరువాత హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్‌గా హాస్పిటల్స్, కౌన్సెలింగ్ సంస్థలు, క్లినిక్స్, మెంటల్ హెల్త్ సంస్థలు, రిహాబిలిటేషన్ సెంటర్లు, హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు, హెల్త్‌కేర్ అసోసియేషన్స్, నర్సింగ్‌హోమ్స్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్స్, యూనివర్సిటీలు, రిసెర్చ్ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్, క్వాలిటీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్, ఆర్గాన్ ట్రాన్స్పోర్ట్ ప్రోగ్రామ్ మేనేజర్, సోషల్ అండ్ సర్వీస్ కమ్యూనిటీ మేనేజర్స్, హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్టులుగా అవకాశాలు లభిస్తాయి. వేతనాలు కూడా పోస్టును బట్టి కనీసం ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు లభిస్తాయి.
కోర్సులు
గ్రాడ్యుయేషన్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
అర్హత: సైన్స్ స్ట్రీంలో కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో కూడా ఉత్తీర్ణులు కావాలి.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్
అర్హత: హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ రెండేండ్ల కోర్సు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీబీఎస్/ బీడీఎస్/ బీపీటీ చేసిన వారు కూడా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకుంటున్నారు.
డిప్లొమా ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్
అర్హత: ఇంటర్లో ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్‌గా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
మాస్టర్స్ ఇన్ హస్పిటల్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్
అర్హత: ఇంటర్ సైన్స్ స్ట్రీంలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. ఎంబీబీఎస్/ బీడీఎస్ చేసినవారు కూడా అర్హులు.
నైపుణ్యాలు
హాస్పిటల్ అడ్మిన్రిస్టేటర్గా రాణించాలంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నాయకత్వ లక్షణాలుండాలి. సమస్యలను పరిష్కరించగలిగే నైపుణ్యం, డేటాను విశ్లేషించే సామర్థ్యం పెంచుకోవాలి. పరిశ్రమపై అవగాహన ఏర్పర్చుకోవాలి. త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే సమయస్ఫూర్తి ఉండాలి.
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఏఐఐఎంఎస్) ఢిల్లీ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్
అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ – హైదరాబాద్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ రిసెర్చ్ – ఢిల్లీ, బెంగళూరు, జైపూర్
స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ మణిపాల్ యూనివర్సిటీ- మణిపాల్
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్- వెస్ట్ బెంగాల్
దేవి అహల్య విశ్వవిద్యాలయ- ఇండోర్
త్రిపుర ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్స్- త్రిపుర
ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్- పుణె
సింబయాసిస్ సెంటర్ ఆఫ్ హెల్త్ కేర్- పుణె
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్- పిలాని
అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా- పీజీడీహెచ్ఎం
అంతేకాకుండా రెండేళ్ల అనుభవం ఉన్న ఎంబీఏ అభ్యర్థులకు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్- న్యూఢిల్లీ, డిగ్రీ పూర్తయి సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి.
రాష్ట్రంలో కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థలు
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్మెడికల్ సైన్స్- మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ- ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్- ఎంబీఏ హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్
బద్రుక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్‌ట్రేడ్ -మాస్టర్స్ ఇన్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్
డక్కన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్-మాస్టర్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏంచేయాలి?
హాస్పిటల్ మేనేజర్స్‌గా వివిధ విభాగాలను సమన్వయం చేయడానికి అవసరమైన ప్రణాళికను రచించుకోవాలి. డాక్టర్స్, ఫిజీషియన్స్, సర్జన్స్, నర్సులు, టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్లను సమన్వయపరిచే బాధ్యత వీరిదే. హాస్సిటల్స్ విస్తరణకు అవసరమైన మానవ వనరులను నియమించుకోవాలి. ఎక్కడ ఎంతమంది అవసరమో పరిశీలించి వారిని సర్దుబాటు చేయడం, నియామకాలకు అవసరమైన బడ్జెట్‌ను రూపొందించడం, ఆర్థిక అవకాశాలను (ఫైనాన్షియల్ రిసోర్స్) పరిశీలించడం, డేటాబేస్, ఐటీసిస్టమ్స్ నిర్వహణ బాధ్యత కూడా హాస్పిటల్ మేనేజర్స్దే. హాస్పిటల్‌కు సంబంధించి ప్రత్యేకంగా అకౌంట్స్, ఫైనాన్స్ విషయాలను పరిశీలించాలి. మొత్తం స్టాఫ్‌కు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. పేషెంట్లకు ఎటువంటి ఆటంకం లేకుండాచూస్తూ భద్రత కల్పించాలి. రోజు అనేక మందితో మాట్లాడాలి. పేషెంట్లను వారి తరఫున వచ్చే కుటుంబ సభ్యులను సంతృప్తిపరచాలి. మానవతా దృక్పథంలో సమస్యలను పరిష్కరించాలి. ఆర్థిక విషయాలను హ్యాండిల్ చేయాలి.
అవకాశాలు
కొవిడ్-19 తరువాత ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో హెల్త్ సెక్టార్ జీడీపీలో ప్రస్తుతం ఉన్న 1.6 శాతాన్ని 2025 వరకు 2-5 శాతానికి పెంచాలని నిర్ణయించింది. కొవిడ్-19 తర్వాత హెల్త్‌కేర్ సెక్టార్లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిపుణులైన సిబ్బంది లేరు. మానవ వనరులు కొరత చాలా ఉంది. అందుకే అనేక కంపెనీలు హాస్పిటల్స్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ కోసం ఎదురుచూస్తున్నాయి.
డిమాండ్ ఉన్న కోర్సు ఎంహెచ్ఎం
దేశం మొత్తంలో ఒక్కతెలంగాణలో మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సును నిమ్స్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కోర్సు చేయాలనుకునే పేద విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ కూడా లభిస్తుంది. ఎంహెచ్ఎం కోర్సుకు చాలా డిమాండ్ ఉంది. ఈ కోర్సు చేసిన వారు విదేశాలతోపాటు మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ టూరిజం, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్, హెల్త్‌కేర్ మార్కెట్లో అవకాశాలు లభిస్తున్నాయి.
ఇటీవల కాలంలో మెడికల్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ విద్యార్థులను నియామకం చేసుకుంటున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం మాకు కాల్స్ వస్తున్నాయి. మా దగ్గర చదివిన విద్యార్థుల్లో ఒక్కరు కూడా ఖాళీగా లేరు. సీఈవోలుగా, సీవోవోలుగా, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్‌గా వివిధ జాబ్స్‌లో సెటిలయ్యారు. క్యాంపస్ రిక్రూంట్మెంట్లోనే అందరికీ దాదాపు అవకాశాలు లభిస్తాయి.
హాస్సిటల్ అడ్మిన్రిస్ట్రేషన్ మేనేజ్మెంట్ కోర్సు చేసిన వారు రూ.25,000 నుంచి రూ.30,000 వరకు ప్రారంభ వేతనంతో ఉద్యోగం లభిస్తుంది.. నిమ్స్‌లో కేవలం 20 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ కోర్సుకు ఉన్న డిమాండ్ రీత్యా సీట్లు పెంచే ఆలోచన కూడా ఉంది. ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగా స్పందిస్తుంది.
-డా. మార్త రమేష్ అనుసంధాన అధికారి నిమ్స్, హైదరాబాద్