ఎన్నో స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. అందులో కొన్నే మార్కెట్లో నిలుస్తున్నాయి. గెలుస్తున్నాయి. కారణం మెంటర్షిప్ లేకపోవడం, ఆర్థిక వనరులు అందకపోవడం. ఆ పరిమితిని అధిగమించడానికే.. నికోలాజీ నెట్‌వర్క్‌ను తీసుకొచ్చింది మెహర్ షేక్. ఈ వేదిక ద్వారా దారీతెన్నూ లేని స్టార్టప్స్‌కు విలువైన సలహాలు అందిస్తున్నది. ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలో చెబుతున్నది. తమదైన రంగంలో పడిలేచిన దిగ్గజాలను మెంటర్స్గా పరిచయం చేస్తున్నది.
మోటివేషనల్ స్పీకర్‌గానూ పేరు తెచ్చుకున్నది మెహర్. గతంలో న్యూస్ యాంకర్‌గా పనిచేసింది తను. ఆమె నేతృత్వంలోని నికోలాజీ.. కార్పొరేట్ కంపెనీల ప్రచారానికి కంటెంట్ అందిస్తున్నది. ముంబైలోని మధ్యతరగతి ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన ఈ యువతికి మరొకరి దగ్గర పనిచేయడం నచ్చదు. ‘నీకు నువ్వే బాస్‌గా ఉండగలిగే అవకాశం ఉన్నప్పుడు.. మరో బాస్ దగ్గర పనిచేయడం ఎందుకు?’ అంటుంది. ‘స్టార్టప్స్.. ప్లీజ్ స్టాండప్’ అంటూ కొత్త సంస్థలలో ఉత్సాహం నింపుతున్నది మెహర్.