అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కేందుకు అరుదైన అవకాశం ఊరిస్తున్న వేళ.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ శుభారంభం చేశాడు. గాయం కారణంగా రోజర్ ఫెదరర్, వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో నొవాక్ జొకోవిచ్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్‌కు దూరమవగా.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించిన నాదల్ రెండో రౌండ్‌కు చేరాడు! మహిళల సింగిల్స్‌లో నవోమీ ఒసాకా, ఆష్లే బార్టీ ముందంజ వేయగా.. అమెరికా యువ సంచలనం కొకొ గాఫ్‌కు చుక్కెదురైంది!
మెల్బోర్న్: కఠిన నిబంధనల మధ్య ప్రారంభమైన సీజన్ ఆరంభ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రాఫెల్ నాదల్ (స్పెయిన్), నవోమీ ఒసాకా (జపాన్) శుభారంభం చేశారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోక పోవడంతో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను నిర్దాక్షిణ్యంగా గ్రాండ్‌స్లామ్ నుంచి తప్పించిన నిర్వాహకులు.. పటిష్ట బయోబబుల్‌లో టోర్నీ కొనసాగిస్తున్నారు.
స్టార్ ప్లేయర్ నాదల్ 6-1, 6-4, 6-2తో గిరోన్‌పై వరుస సెట్లలో విజయం సాధించగా.. మూడో సీడ్, ఒలింపిక్ చాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 7-6 (7/3), 6-1, 7-6 (7/1)తో తన దేశానికే చెందిన డానియల్ అల్టమైర్పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6-0, 6-1తో సురెంకోపై విజయం సాధించగా.. నవోమీ ఒసాకా 6-3, 6-3తో కమిలా ఒసొరియోపై నెగ్గి రెండో రౌండ్లో ప్రవేశించింది. అమెరికా యువ సంచలనం కొకొ గాఫ్ 4-6, 2-6తో వాంగ్ ఖియాంగ్ చేతిలో పరాజయం పాలైంది.