పంతం నెగ్గించుకున్న మంత్రి ఉత్తమ్!
తెలంగాణ పౌరసరఫరాల శాఖలో గత కొంతకాలంగా సాగుతున్న సమాంతర అధికార ప్రయోగానికి ఎట్టకేలకు తెరపడిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
- పౌరసరఫరాల శాఖలో ఆధిపత్య పోరుకు తెర
- సీఎం అండతో రైస్మిల్లర్లపై కమిషనర్ కొరడా
- మంత్రికి చెప్పకుండా సీఎంవోకు డైరెక్ట్ రిపోర్ట్
- ఉత్తమ్ అసంతృప్తి.. సీఎంతో భేటీలు, ఫోన్లు కట్
- చివరికి కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు స్థానచలనం
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పౌరసరఫరాల శాఖలో గత కొంతకాలంగా సాగుతున్న సమాంతర అధికార ప్రయోగానికి ఎట్టకేలకు తెరపడిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తన శాఖలో తన ప్రమేయం, సమన్వయం లేకుండానే కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి కార్యాలయం అండతోనే స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
దూకుడుగా వెళ్లడం, శాఖాపరమైన కీలక నిర్ణయాలు, దాడుల విషయంలో తనకు సమాచారం ఇవ్వకుండా నేరుగా ముఖ్యమంత్రికే రిపోర్టులు పంపుతున్నారని ఉత్తమ్ గత కొంతకాలంగా తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలిసింది. మంత్రి తన అసంతృప్తిని నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతోపాటు కొంతకాలం సీఎంతో దూరం పాటించారని, చివరికి మాటలు, ఫోన్లు, భేటీలు కూడా కట్ చేసుకున్నారనే చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా స్టీఫెన్ రవీంద్రను పౌరసరఫరాల శాఖ నుంచి తప్పించారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
దూకుడుగా వెళ్లిన స్టీఫెన్ రవీంద్ర
గత ఏడాది సెప్టెంబర్‌లో కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి స్టీఫెన్ రవీంద్ర పౌరసరఫరాల శాఖలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ పేరిట దూకుడు పెంచారు. ముఖ్యంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలు, నకిలీ ట్రక్షీట్లు, సన్నబియ్యానికి బదులు దొడ్డు బియ్యం సరఫరా వంటి ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లులపై మెరుపు దాడులు, సీఐడీ విచారణలకు ఆదేశాలు జారీచేశారు. నిజామాబాద్ డీసీఎస్వో సస్పెన్షన్, పలువురు మిల్లర్ల అరెస్టులు, రూ.6,630 కోట్ల మేర పేరుకుపోయిన బకాయిల రికవరీ పేరిట సాగిన ఈ ఆపరేషన్ శాఖ మంత్రి ప్రమేయం లేకుండానే జరిగిపోయిందని చెప్తున్నారు.
ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు, తేమ శాతం నిబంధనలు, బియ్యం ధరల నియంత్రణ వంటి అంశాల్లో రైతులు, మిల్లర్లు, వ్యాపారుల నుంచి వచ్చే ఒత్తిడిని మంత్రి ఉత్తమ్ ఎదురోవాల్సి వస్తుంటే, మరోవైపు కమిషనర్ స్థాయి అధికారి తనకు చెప్పకుండానే దాడులు చేయించడం మంత్రిని రాజకీయంగా ఇరుకునపెట్టిందని పార్టీ నేతలు అంటున్నారు. క్షేత్రస్థాయిలో మిల్లర్లు అజ్ఞాతంలోకి వెళ్లడం, ధాన్యం సేకరణపై ఆ ప్రభావం పడటం వంటి పరిణామాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయని చెప్తున్నారు.
మౌనంగానే నిరసన తెలిపిన ఉత్తమ్
తన శాఖలోనే తనకు తెలియకుండా జరుగుతున్న ఈ పరిణామాలతో ఉత్తమ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తమ్ తన నిరసనను మౌనంగానే, అత్యంత పదునుగా వ్యక్తంచేశారనే ప్రచారం జరుగుతున్నది. సీఎంతో నేరుగా మాట్లాడటం నిలిపివేయడంతోపాటు, సీఎం ఫోన్‌కాల్స్‌కు స్పందించకపోవడం, అధికారిక భేటీలకు దూరంగా ఉండటం వంటి చర్యలతో తన అసంతృప్తిని వ్యక్తంచేసినట్టు సమాచారం.
సీనియర్ మంత్రి అలిగి దూరం జరుగడం ప్రభుత్వ మనుగడ, పార్టీ ప్రతిష్టకు ఇబ్బందికరంగా మారుతుందని గ్రహించిన సీఎం ఎట్టకేలకు దిగిరాక తప్పలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో స్టీఫెన్ రవీంద్రను పౌరసరఫరాల శాఖ కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించి, కొత్తగా ఏర్పాటైన తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్‌గా బదిలీ చేశారనే ప్రచారం జరుగుతున్నది. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి వై నాగిరెడ్డిని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నియమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

