పయనం ఎటు సాగినా ఆమె పాదం నాట్యం దగ్గరే ఆగిపోయింది. తాళజతులకు అనుగుణంగా ఆమె నాట్య విన్యాసం సాగింది. కూచిపూడిలో అభినయ కళాకారిణిగా ఎదిగారామె. అంతటితో ఆగలేదు నాట్యశాస్ర్తాన్ని విద్యార్థిగా ఉపాసించి.. ప్రొఫెసర్‌గా ఎందరినో కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. ముందుతరం గురువులు చూపిన మార్గాన్ని నేటి తరానికి పరిచయం చేస్తున్నారు. కూచిపూడి పరిణామ క్రమంపై పరిశోధనాత్మక గ్రంథాలు వెలువరించారు ప్రొఫెసర్ అనురాధ జొన్నలగడ్డ తడకమడ్ల. శాస్త్రీయ నృత్య వైభవానికి దశాబ్దాలుగా కృషి చేస్తున్న ఆమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మొదటి మహిళా వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన కళా ప్రస్థానాన్ని జిందగీతో ఇలా పంచుకున్నారు..
చిన్నప్పుడు సంగీతం వినిపిస్తే స్టెప్పులేసేదాన్ని. హైదరాబాద్ చిక్కడపల్లిలో మేం నివసించే వీధిలోనే వేదాంతం జగన్నాథ శర్మ కూచిపూడి నేర్పించేవారు. నా ఆసక్తి గమనించి మా వాళ్లు అయిదో ఏట కూచిపూడి శిక్షణకు పంపించారు. మా నాన్న జొన్నలగడ్డ లక్ష్మీ నారాయణ బ్యాంక్ ఉద్యోగి. తనకు గుంటూరు బదిలీ అయింది. అక్కడ సుబ్బలక్ష్మి గారి దగ్గర శిక్షణ ఇప్పించారు. హైదరాబాద్ బాలల అకాడమీ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో క్లాసికల్ డ్యాన్స్ సబ్-జూనియర్ కేటగిరిలో ప్రథమ బహుమతి గెలిచాను. తర్వాత ఏడాది వైఎంసీఏ క్లాసికల్ డ్యాన్స్ కాంపిటీషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాను. ఆ తర్వాత కాలంలో చింతా రాధాకృష్ణమూర్తి గారి దగ్గర చేర్పించారు. గుంటూరు నుంచి చెల్లూరుకు వెళ్లాం.
నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు నాన్నకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. వెనక్కివచ్చేశాం. అప్పుడే శోభానాయుడి గారి ఆధ్వర్యంలో వెంపటి చినసత్యం గారు కూచిపూడి ఆర్ట్ అకాడమీని హైదరాబాద్‌లో ప్రారంభించారు. అందులో చేరాను. శోభానాయుడు గారితో వెళ్లి కూచిపూడిలో ప్రదర్శనలు ఇచ్చాను. నృత్య రూపకాల్లో అభినయ ప్రాధాన్యమైన ప్రదర్శనలు ఎక్కువ చేశాను. నారదుడి పాత్రలో నన్ను ఎక్కువమంది ఇష్టపడేవాళ్లు.

నాన్న చెప్పిన మాట
నా ప్రదర్శన ఉంటే ఇంట్లోవాళ్లంతా బాధ్యత పంచుకునేవాళ్లు. లేటయితే ఇద్దరి అన్నయ్యల్లో ఒకరు వచ్చి తీసుకుపోయేవాళ్లు. ప్రాక్టీస్ చేస్తుంటే అక్క పాడుతూ ఉండేది. ప్రదర్శన ఉంటే మా అమ్మగారు నాగలక్ష్మి నాతో పాటు వచ్చేది. ప్రముఖ కళాకారులు హైదరాబాద్‌లో ప్రదర్శనకు వస్తే నాన్న తీసుకెళ్లి చూపించేవారు. ‘నువ్వు అంతెత్తు ఎదగాలి’ అని చెప్పేవారు. ఆ ప్రభావంతో డ్యాన్స్ నా ఫ్యూచర్ అనుకుంటున్న రోజుల్లో.. పద్మా సుబ్రహ్మణ్యం కళారంగంలో పీహెచ్డీ చేశారు. అకడమిక్‌గా వెళ్లొచ్చని తెలిశాక కూచిపూడిలో పీహెచ్డీ చేయాలనుకున్నా. ఇంటర్మీడియెట్‌లో బైపీసీ చదివినా డిగ్రీలో బీఏలో చేరాను. నా డిగ్రీ అయిపోయినప్పుడే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో సరోజనీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ ప్రారంభించారు. మాస్టర్ ఆఫ్ పెర్ఫామింగ్ ఆర్ట్స్‌లో చేరాను.
మొదటి మొట్టు
మూడో సెమిస్టర్ చదువుతున్న రోజుల్లో నటరాజ రామకృష్ణ గారు స్కూల్లో ఫ్యాకల్టీగా చేరారు. పీజీ చదువుతూనే జేఆర్ఎఫ్ సాధించాను. నా పీహెచ్డీ ‘ట్రెడిషన్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ కూచిపూడి డ్యాన్స్’కి ఆయనే గైడ్‌గా ఉన్నారు. కలాప, యక్షగాన పద్ధతుల నుంచి కూచిపూడి సంప్రదాయం పరిణామం తెలియజేయడం నా లక్ష్యం. హిస్టరీ ప్రొఫెసర్ రామకృష్ణ గారి మార్గదర్శనంలో చారిత్రక ఆధారాలతో కూచిపూడి చరిత్రను అన్వేషించాను. సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రభావాల వల్ల కళలు మార్పులకు లోనవుతాయి. ఆ మార్పులను గుర్తించేందుకు రెవెన్యూ రికార్డుల ద్వారా కూచిపూడి చరిత్రను సేకరించాను. నా గురువుల్లో ఎక్కువమంది కూచిపూడి వాళ్లే. వెంపటి మాస్టర్ గారు చేసిన మార్పులు, చేర్పులపై ఎక్కువగా ఫోకస్ చేశాను. మద్రాస్ వెళ్లి ఆయన్ని చాలాసార్లు సంప్రదించాను. ఈ పరిశోధన కోసం పసుమర్తి వేణుగోపాలకృష్ణ శర్మ, వేదాంతం పార్వతీశం, యజ్ఞ నారాయణ శర్మ వంటి ప్రముఖులెందరినో సంప్రదించాను.
గురువులు చూపిన బాటలో హైదరాబాద్ యూనివర్సిటీలోనే కాంట్రాక్ట్ లెక్చరర్ ఉద్యోగంలో చేరాను. పీహెచ్డీ అయిన తర్వాత ఏం చేయాలనే ఆలోచనలో ఉన్న. ఉద్యోగంలో పడిపోతే పెర్ఫామెన్స్ దెబ్బతింటుందనే భయం కలిగింది. ‘అకడమిక్స్‌లో పీహెచ్డీ మొదటిమెట్టు. ఆ తర్వాత రీసెర్చ్, పర్సనల్ వర్క్, అకడమిక్ నాలెడ్జ్‌ని అనుసంధానం చేసుకోవడానికి ఇది సరైన వేదిక’ అని కొంతమంది పెద్దవాళ్లు సలహా ఇచ్చారు. వాళ్లు చూపినబాటలోనే నడిచాను. కొన్నాళ్లకు ఉద్యోగం రెగ్యులరైజ్ చేశారు. ఇరవై నాలుగేళ్ల క్రితం ప్రొఫెసర్‌గా పదోన్నతి వచ్చింది. అలా నాట్యం, బోధనే జీవితంగా మారిపోయింది.
తరాల అంతరాలకు వారధులం
విద్యార్థులు వేర్వేరు నేపథ్యాల నుంచి వస్తారు. ఎవరికి ఎలా నేర్పాలో కచ్చితత్వం అవసరం. నేర్పే క్రమంలో బోలెడన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. ‘నేను కరెక్ట్‌గానే నేర్పిస్తున్నా?’ అనే సందేహాలు కూడా తలెత్తుతాయి. అందుకే నిరంతరం కొత్తగా నేర్చుకోవాల్సిందే! బోధన వల్ల నృత్యంలోని లోతుపాతులు తెలుస్తాయి. అందువల్ల టీచింగ్‌ని ఎంజాయ్ చేశాను. వీళ్లకు పెద్ద గురువులను చూసిన అనుభవం తక్కువ. అందుకే వాళ్లకు వీడియోలు చూపించి పూర్వపు గురువుల కృషిని అవగాహన కల్పిస్తున్నాం. ఈ తరానికి వాళ్ల సంప్రదాయాన్ని అందించడంలో మేం వారథులుగా ఉంటున్నాం.
కొత్తదారిలో…
‘మేం సముద్రం దాకా తీసుకువెళ్తాం. ఎవరి దోసిలి ఎంత ఉంటే అంత పట్టుకుంటారు’ అని వెంపటి గారు అనేవారు. నేనూ ఆ సముద్రం నుంచి కొంత పట్టుకొచ్చాను. ఈ నడవడి కూడా ఆ గురువులను చూసి అలవర్చుకున్నదే. మా విద్యార్థులను సముద్రం దాకా తీసుకుపోతున్నాం. వాళ్ల దోసిలి ఎంత ఉంటే అంత పట్టుకుపోతారు. శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడంలో ఒక స్థాయి వరకే గురువుల దగ్గర నేర్చుకుంటాం. ఎక్కువ స్థాయికి చేరుకోవాలంటే సొంత ఆలోచన ఉండాలి. అది సృజనాత్మకంగా ఉండాలి. కొత్త మార్గంలో నడవగలగాలి.
అధ్యయనం, బోధన, పరిశోధనతో మూడు దశాబ్దాలు గడిచింది. ఈ కృషి ఫలితమే హూ ఈజ్ హూ ఆఫ్ కూచిపూడి, కూచిపూడి చరిత్ర – పరిణామ క్రమం రచనలు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన సమగ్ర ఆంధ్ర చరిత్ర రచనలో మూడు సంపుటాల కోసం రచనలు చేశాను. మరెన్నో పరిశోధక వ్యాసాలు ప్రచురించాను. ఇన్నేండ్ల కృషికి ఆదిత్య విక్రమ్ బిర్లా అవార్డ్ ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉమెన్ అచీవర్ అవార్డ్‌తో గౌరవించింది. కూచిపూడి నా చదువు, చిరునామా, జీవితం!

ఇప్పుడు భయపడను!
ఇన్నేండ్ల కెరీర్లో పురుషాధిక్య సమస్య ఎదురుపడలేదు. విశ్వవిద్యాలయంలో ఇంతకాలం పురుషులే ఎందుకు వీసీలు అయ్యారో తెలియదు. కానీ, ఆడపిల్లలు చదువుకునేందుకు, మహిళలు పనిచేసేందుకు మా విశ్వవిద్యాలయం అనువైనది. మహిళకే బాధ్యతలు అప్పగించాలని వైస్ చాన్సలర్ (తాత్కాలిక) పదవి నాకు ఇచ్చారని అనుకోను. నా అనుభవమే అవకాశం ఇప్పించింది. కొత్తలో ఇబ్బంది పడ్డాను. ఎవరి సమస్య వాళ్లు చెబుతుంటే ఇదేమిట్రా బాబోయ్ అనుకునేది. ఈ రోజు ధర్నాలేదేంటని ఇప్పుడు అనిపిస్తుంది. వీసీ బాధ్యతల్లో ఉన్నా వారంలో రెండు క్లాస్‌లు చెబుతున్నా. ఉదయం కూచిపూడి నేర్పి, మధ్యాహ్నం నుంచి ఆఫీస్ పనులు చూసుకుంటాను.
సపోర్టివ్ ఫ్యామిలీ
మా ఆయన పేరు అరవింద్. తను క్రికెటర్. అడ్వైర్టెజింగ్ బిజినెస్ చేస్తున్నారు. ఇద్దరం క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నాం. మా ఆయనతోపాటు అత్తగారు నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తారు. మా అబ్బాయి రంజీ ప్లేయర్. కీ బోర్డ్, డ్రమ్స్ ప్లే చేస్తాడు. అమ్మాయి డిగ్రీ సైకాలజీ చదువుతున్నది. వయోలిన్ ప్లే చేస్తుంది. కూచిపూడి నేర్చుకోవాలని ఒత్తిడి చేయలేదు. ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది
నేర్చుకునే అవకాశం కల్పించాం.
– నాగవర్ధన్ రాయల
చిన్న యాదగిరిగౌడ్