శత్రువులు మన నీళ్లను మళ్లిస్తారు.. మన నిధులను దోచేస్తారు.. మన భూములను ఆక్రమిస్తారు.. మన వనరులను కొల్లగొడుతున్నారని కొంచెం వెనుకో ముందో మనకు తెలిసిపోతుంది. ప్రశ్నిస్తాం, ఎదిరిస్తాం? మరి.. వాళ్లు మన నాయకత్వాన్ని నిశ్శబ్దంగా నిర్మూలించజూస్తారని తెలుసా మనకు? అది నీకు అంత ఈజీగా అర్థం కాదు. ఒక ప్రాంతాన్ని జాతిని బతికించే కీలకమైన అత్యంత విలువైన వనరు నాయకత్వమే. నదులనో.. సంపదలనో కబళించాలంటే ఆ ప్రదేశానికి రక్షణగా ఉన్న దళపతులను గుట్టుగా మట్టుపెడితే చాలు.. అన్నీ శత్రువు వశమైపోతాయి. తమ మాట వినని దేశాధినేతలను అగ్రరాజ్యాలు పడగొట్టి అక్కడ తమ తొత్తులను గద్దె ఎక్కించి.. పరోక్ష వలసలుగా మార్చుకొని నియంత్రిస్తుంటాయి ఈ తరహాలోనే. నాయకత్వం మీద జరిగే దాడిని పసిగట్టి ప్రతిఘటించే సోయి అక్కడి ప్రజలకు ఉన్నదా లేదా అన్నదే ఆ ప్రాంత మనుగడను నిర్ణయిస్తుంది.
ఇవ్వాళ తెలంగాణలో ఎవరి మీద దాడి ఎక్కువగా జరుగుతున్నది? అందరూ ఎవర్ని టార్గెట్ చేస్తున్నారు? ఎవరి వ్యక్తిత్వం మీద క్షుద్ర విద్యల విష ప్రయోగం చేస్తున్నారు? ఎవరు లక్ష్యంగా నిర్విరామ నికృష్ట ప్రాపగండా కొనసాగుతున్నది? ఇంకెవరి మీద.. కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మీద. రాబోయే రణరంగంలో ఎవరి చేతిలో తమకు పరాజయం ఎదురవుతుందని భావిస్తారో అతడి మీదే మొదట గురిపెడతాయి శత్రు శిబిరాలు. జనం చేసిన ఒక పొరపాటు వల్ల ఇక్కడ బూజు పట్టిన పాత ఫ్యూడల్ భావజాలం.. పెత్తందారీ నైజంతో నిండిన శక్తులకు మళ్లా అధికార పీఠం దక్కింది. తమ పవర్‌ను పదిలపర్చుకోవడానికి అసలు యుద్ధం మొదలుగాక ముందే కేటీఆర్‌ను గాయపరిచి సమరాంగణంలో దిగకుండా చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్లు.
నిన్నటి యుద్ధాల్లో కేసీఆర్ చేతిలో ఓడిపోయి పరాభవంతో, ప్రతీకారంతో రగిలిపోతూ కోల్పోయిన ఆధిపత్యాన్ని తిరిగి సంపాదించాలని ఆరాటపడుతూ.. అవకాశం కోసం కాచుకొని కూర్చున్నాయి కొన్ని పరాయి మూకలు. ఇప్పుడు అదును దొరికింది. ఇక్కడి తొత్తులతో పొత్తు కూడారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్లా సొంత పార్టీ చేతుల్లోకి తెలంగాణ అధికారం పోకుండా ఉండేందుకు మాయోపాయాల రచన జరుగుతున్నది. ఆ దుష్ట పథకంలో భాగంగానే కేటీఆర్‌ను దెబ్బకొట్టడానికి దాడులను ముమ్మరం చేశారు.
ఈ రెండు ముఠాలు కేటీఆర్ మీదనే ఆయుధాలను ఎందుకు ఎక్కుపెట్టాయి? శత్రువులను అంతగా భయపెడుతున్న కేటీఆర్ బలాలు.. ప్రత్యేకతలు ఏమిటి? ఆ ఇద్దరి ఉమ్మడి ప్రయోజనాలకు కేటీఆర్ ప్రమాదంగా ఎట్లా మారారు?
ఫ్యూడల్ పోకడలు లేని ఆధునిక, నాగరిక నాయకుడు: అభివృద్ధి చెందిన దేశాల్లో, పశ్చిమ ప్రపంచంలో ఉన్న ఆదర్శ నాయకులను చూసి మనవాళ్లు ఇట్లా ఎందుకుండరని అనుకుంటాం కదా? అట్లాంటి ఫీచర్స్ ఉన్న ఫ్యూచర్ పర్ఫెక్ట్ లీడరే కేటీఆర్. సంస్కారం సమృద్ధిగా ఉండే ఆధునిక నాగరిక నాయకుడు. ఫ్యూడల్ లక్షణాలు పుష్కలంగా ఉండే సగటు రాజకీయనేత కాదు. పదునైన ప్రజాస్వామ్య భాష.. ప్రగతిశీల భావజాలం.. ఆచరణాత్మక అభివృద్ధి దృక్పథం.. సున్నితత్వం అన్నీ కలబోసిన కొత్తతరం ప్రతినిధి. కులాధిపత్య పోకడలు.. మతోన్మాద ద్వేషాలు.. ఇరుకు గోడలు.. సంకుచిత జాడ్యాలు లేని ఉన్నత ఆలోచన కలిగిన విశాల విశ్వనరుడు.
పదేండ్ల కాలంలో వ్యక్తిత్వ వికాస పాఠాలై ప్రాచుర్యం పొందాయి కేటీఆర్ ప్రసంగాలు. మాటలు స్ఫూర్తి మంత్రాలై మంత్రముగ్ధుల్ని చేశాయి. ఉపన్యాసాల్లో నైపుణ్యాల మీద.. వ్యాపార దక్షత మీద యువతకు ప్రేరణనిచ్చేలా చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికలపై వైరల్‌గా మారి ఆకట్టుకున్నాయి. పాత.. మూస కెరీర్ ధోరణులను వదిలించడానికి, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అలవర్చుకునేలా ప్రోత్సహించడానికి ప్రతి సందర్భంలో ఇచ్చే సందేశాలను చూసి.. ఇదేంటి, వేదికల మీద రాజకీయ నాయకులు ఇట్లా కూడా మాట్లాడగలరా అని ఆశ్చర్యపోయాం మనం. బూతులు.. రోతలతో భ్రష్ఠుపట్టిన మురికి ప్రవాహంలో ఒక స్వచ్ఛమైన జలధారలా కేటీఆర్ భాష.. భావజాలం పారి మలినాలను శుద్ధిచేసింది.
దశాబ్దాలుగా ద్వితీయ శ్రేణి నాయకులుగా.. ఆత్మగౌరవం లేని అనుచరులుగా.. అణగిమణగి బతికిన ఈ ప్రాంత రాజకీయ నేతలను చూసీ చూసీ ఒక ఆత్మన్యూనతలో ఉండిపోయింది తెలంగాణ సమాజం. అట్లాంటి చోట.. అంతర్జాతీయ వేదికలపై మనోడు ఒకడు అనర్గళంగా అద్భుతంగా అదరగొడుతూ ‘రండి నా తెలంగాణకు’ అని ప్రపంచాన్ని మెప్పించి.. ఒప్పించి.. రప్పిస్తుంటే పులకించిపోయిందీ నేల. ఇతడు మా తెలంగాణ లీడర్ అని గర్వంగా చెప్పుకొనే అవకాశం వచ్చింది మనకు. మనకు తెలివిలేదని ఇన్నాళ్లు మనల్ని గేలి చేసిన వాళ్లముందు తలెత్తుకు నిలబడేలా.. మన సత్తాకు సమర్థతకు నిలువెత్తు నిదర్శంగా నిలిచాడు కదా కేటీఆర్. కాదంటారా.. ఎవరైనా? ఈ క్రమంలో మన సామూహిక ఆత్మవిశ్వాసం పైపైకి ఎగబాకింది.
సాధారణంగా మీడియా ఇంటర్వ్యూల్లో నేతలు తమ అజ్ఞాన ప్రదర్శన చేసి దొరికిపోయి ట్రోల్ అవుతుంటారు. కానీ, కేటీఆర్‌తో డిబేట్లు, ఇంటర్వ్యూల్లో మాత్రం కొమ్ములు తిరిగిన జాతీయ జర్నలిస్టులు సైతం తడబడి.. నోరెళ్లబెట్టి.. తెల్లముఖం వేసిన దృశ్యాలను చూశాం మనం. సబ్జెక్టు మీద పట్టు.. అంకెలు, ఆధారాలతో సాధికారికంగా ఇచ్చే సమాధానాలు.. హేతుబద్ధంగా, తార్కికంగా ఉండే వాదనాపటిమ కేటీఆర్ ప్రత్యేకత.
విశాల భావాలు, విషయ పరిజ్ఞానం, విభిన్న దృక్పథం ఉన్న కేటీఆర్‌ను చూసి ఆసేతు హిమాచలం విద్యావంతులు, మేధావులు, ప్రొఫెషనల్స్, వ్యాపార దిగ్గజాలు దేశానికి ఇట్లాంటి నాయకులు కావాలని ప్రశంసించారు. ఇవేమీ అతిశయోక్తులు కాదు. మనం చూసిన, చదివిన, విన్న విషయాలే. నలుగురు పిల్లల్ని కనాలి.. జనాభాను పెంచాలని అందరూ చర్చలు చేస్తుంటే.. పిల్లలను కనడం మహిళల చాయిస్ అని గుర్తు చేసి పునరుత్పత్తి హక్కుల గురించి మాట్లాడారు కేటీఆర్! అంబేద్కర్ అందరివాడని విశ్లేషిస్తూ… బాబా సాహెబ్‌ను ఆధునిక భారత నిర్మాతగా చూడాలని అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని చూసి దళిత బహుజన విద్యావంతులు ఆశ్చర్యపోయారు. సంప్రదాయ రొడ్డకొట్టుడు రాజకీయ ధోరణులకు భిన్నంగా ఆలోచిస్తూ స్త్రీలు, దళితులు, ఆదివాసులు ఇతర పీడిత ప్రజల పక్షపాతిగా నిలబడటమే కేటీఆర్ విలక్షణత.
అసలు సమస్యంతా ఇక్కడే మొదలైంది. కేటీఆర్ వ్యక్తిత్వం మీద ఎడతెగని వరుస, చవకబారు దాడులకు అసలు కారణాలు అక్కడే ఉన్నాయి. అనుకోకుండా అదృష్టం కలిసొచ్చి అందలమెక్కిన వాళ్లకు తమ ప్రత్యర్థిగా కేటీఆర్ ఉండటం పెద్ద తలనొప్పిగా మారింది. ఆయన నెలకొల్పిన ప్రమాణాలను అందుకోవడం వాళ్ల తరం కావట్లేదు.
ప్రతి సందర్భంలో, ప్రతి వేదికలో కేటీఆర్‌తో పోలిక రావడం, తమ తెలివి తక్కువతనం బయటపడిపోవడం వాళ్లకు అవమానంగా ఉంది. తక్షణం కేటీఆర్ కార్యదక్షత, ప్రతిభా పాటవాలు, సత్తా సామర్థ్యాల మీద నుంచి చర్చను మళ్లించకపోతే పతా లేకుండా పోతామని అర్థమైంది ఏలుతున్నవారికి. అందుకే, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్, ఫ్యామిలీ పార్టీలో డ్రగ్స్ అంటూ నీచమైన, హీనమైన లీకులు… క్యారెక్టర్‌ను డ్యామేజ్ చేసే కట్టు కథలను జనంలోకి కుప్పలు తెప్పలుగా వదిలారు. నిత్యం వాళ్లు బురద చల్లుతూ ఉంటారు.. కేటీఆర్ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. రోజూ అవే వార్తలుగా ఉండాలి. ఇదే వాళ్ల మురికి ఎజెండా.
రేపటి నాయకుడు ఇవ్వాళే వచ్చాడు..: మనుషులతో నడుచుకునే తీరులో మర్యాద, హుందాతనం, సంస్కారం తొణికిసలాడే మంచి వ్యక్తి మీద అహంకారి అని ముద్ర వేశారు. కేటీఆర్‌కు నటనరాదు, నటించలేడు. కడుపులో ఒకటి పెట్టుకొని బయట ఇంకొకటి మాట్లాడలేడు. బహుశా అదే పెద్ద బలహీనతేమో. కేటీఆర్ సంభాషణ మృదువుగా ఉంటుంది. చుట్టూ వ్యక్తులను గౌరవంగా చూస్తాడు. అనుచరులకైనా, ఇతర నాయకులకైనా ఆత్మగౌరవానికి భంగం కలిగే పరిస్థితి రానేరాదు. కపటత్వం, హిపోక్రసీ ఆయన దరిదాపుల్లో కనిపించవు. రెండు ముఖాలు లేవు. అవసరానికో మాస్కు ధరించడం ఉండదు. పబ్లిక్ లైఫ్‌లో ఒకలా, ప్రైవేట్ జీవితంలో మరొకలా ప్రవర్తించే రకం కాదు. ఆయనతో కలిసి పనిచేసిన వాళ్లెవరూ.. ఇంకో నాయకుడి దగ్గర ఇమడలేరు. అంత పద్ధతిగా ఉంటుంది కేటీఆర్ వర్కింగ్ ైస్టెల్.
పదేండ్ల పాలనలో తెలంగాణను భూస్వామ్య భావజాలం నుంచి బయట పడేసేందుకు అవసరమైన ఆర్థిక పునాదులను, సామాజిక పరిస్థితులను కల్పించాడు కేసీఆర్. అయినా ఇంకా ఒక సమాజంగా మనం సంపూర్ణంగా ఫ్యూడల్ ఆలోచనలు, విలువల నుంచి బయటపడలేదు. ఒక పరివర్తన దశలో ఉన్నాం. పాత కొలతల్లో, కొలమానాల్లో కొలిచి చూసేవాళ్లకు పూర్తిగా అర్థంకాడు కేటీఆర్. కొత్త తరహా రాజకీయాలను కోరుకుంటున్న నవ్య తరాలు అభివృద్ధి ఆధారిత రాజకీయం కావాలని ఎదురుచూస్తున్న నూతన సమూహాలు.. ఇగో, ఇట్లాంటి లీడర్ కావాలి దేశానికి అని ఒక చర్చ జరిగేలా చేసింది కేటీఆర్ ఆచరణ. ఏ రాష్ట్ర ఐటీ మంత్రయినా.. ఏ నేతల వారసులైనా కేటీఆర్‌తో పోల్చిచూసి జనం బేరీజు వేసుకునే పరిస్థితి వచ్చేసింది. రేపటి రోజుల్లో రావాల్సిన వాడు, రేపటి తరానికి అవసరమైనవాడు మన రాజకీయాల్లోకి ముందే వచ్చేశాడు.
ఫోన్ ట్యాపింగ్.. కాళేశ్వరం కమిషన్.. ఫార్ములా ఈ కేసు, డ్రగ్స్ అంటూ పూటకో లీకులతో భారీ డైలీ సీరియల్ డైవర్షన్ డ్రామాలు మొదలయ్యాయి. కేటీఆర్‌ను చెడ్డవాడిగా చిత్రించి జనాన్ని నమ్మించడమే లక్ష్యంగా బేతాళ కుతంత్రాలు చెలరేగిపోయాయి. ఇన్నాళ్లు ఈ ప్రచారాలను నమ్మినవాళ్లకు బనకచర్ల జలద్రోహం తర్వాత ఇప్పుడిప్పుడే అసలు అజెండా అర్థమై జ్ఞానోదయం కలుగుతున్నది.
నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీలు.. విజ్ఞాన ఆధారిత, టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడొక కొత్త పరిణామం. ఆవిష్కరణలే మార్కెట్‌ను శాసిస్తున్నకాలంలో రాష్ట్రమో.. దేశమో పురోగమించాలంటే మన మస్తిష్కాలకు సానపెట్టి.. ఊహలకు రెక్కలు తొడిగే విధానాల గురించి యోచించే శాసనకర్తలు కావాలి మనకు. ఒక టీ హబ్.. టీ వర్క్స్.. టాస్క్.. టీఎస్ ఐపాస్ లాంటి విప్లవాత్మక విధానాలు, వేదికలు అట్లాంటి దూరదృష్టి కలిగిన విజనరీ ఆలోచనల్లో నుంచే పుట్టుకొచ్చాయి. 50 శాతం పైగా పట్టణీకరణ చెంది, ఆర్థికవ్యవస్థకు మహా నగరమైన హైదరాబాద్ ఆయువుపట్టుగా ఉన్న రాష్ట్రం మనది. సేవారంగం, టెక్నాలజీ ఆధారిత సెక్టార్లు సంపదకు ఉపాధికి కేంద్రంగా నిలుస్తున్న స్టేట్ ఇది.
ఇదొక చలనశీల యుగం.. శతాబ్దకాలంలో వచ్చే మార్పులు ఇప్పుడు ఒక్క దశాబ్దంలోనే సంభవిస్తున్నాయి. ఈ డైనమిక్ ప్రపంచంతో పోటీ పడి మనల్ని నిలబెట్టాలంటే.. ఈ సమాజం రేపు మనుగడ సాధించాలంటే.. ఆ మార్పులను అవగాహన చేసుకొని ఆ దిశగా నడిపించి, అభివృద్ధి రాజకీయం నెరపగల దిక్సూచి మనకు అవసరం. తెలంగాణ అదృష్టం బాగుండి రేపటిలోకి నడిపించే నాయకుడు కేటీఆర్ రూపంలో రెడీగా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉన్నమా, లేదా అన్నదే ఇక్కడ సమస్య.
మాటలు చెప్పడం గొప్పేం కాదంటారా? అట్లయితే.. అహో అనిపించే ఆచరణ గురించి చెప్పుకుందాం. మెరుపు వేగంతో నిర్ణయం తీసుకొని, ఆగమేఘాల మీద చాపర్ పంపించి.. పక్క రాష్ర్టాల ఊహకందని వ్యూహంతో కిటెక్స్ కంపెనీని తెలంగాణకు తెచ్చిన సన్నివేశం గుర్తుంది కదా! రాష్ర్టాల మధ్య పెట్టుబడుల కోసం జరుగుతున్న పోటీ గురించి మాట్లాడేటప్పుడల్లా కిటెక్స్ ఎపిసోడ్‌ను ఒక ఉదాహరణగా చెప్పుకొంటారు. కేటీఆర్ వేగానికి, నేర్పునకు ఇదొక మచ్చుతునక.
ఫాక్స్‌కాన్ చైర్మన్‌ను విమానాశ్రయం నుంచి ఏ దారిలో తీసుకొస్తే.. నగర గొప్పతనం అర్థమవుతుందో ఆలోచించి రూట్ మార్చి, గంటలో భారతీయ సిటీల మీద అతడికి గల అభిప్రాయాన్ని మార్చేలా చేసి, లక్ష కొలువులు కల్పించే పెట్టుబడిని ప్రకటించేలా చేసిన చాకచక్యం కేటీఆర్‌ది. నిజం కాదా ఇది? ‘నీళ్లు.. నిధులు.. నియమకాలు’ అన్న ఉద్యమ నినాదాన్ని నిజం చేసే మిషన్‌తో పనిచేసి, విధాన విప్లవంతో, వాక్చాతుర్యంతో విశ్వ దిగ్గజాలను హైదరాబాద్ వాకిట్లో వాలేలా చేసిందెవరు, కేటీఆర్ కదా! తాము లేకుంటే హైదరాబాద్ లేనే లేదని విర్రవీగిన వెర్రివాళ్లకు కళ్లు బైర్లు కమ్మేలా భూమిపుత్రుల బుద్ధిబలం ఏంటో చూపించారు కేటీఆర్.
సరిగ్గా ఈ బలాన్ని, ఈ సమర్థతను చూసే బయటి శత్రువుకు బెంగ పట్టుకుంది. చెడిపోయి పడిపోతుందనుకున్న ప్రాంతాన్ని కేసీఆర్ నిటారుగా నింగిని తాకేలా నిలబెట్టేసరికి నివ్వెరపోయారు. మళ్లా భవిష్యత్ తెలంగాణను భద్రంగా నడిపించే నవతరం మార్గదర్శి తయారై ఉండేసరికి వాళ్ల అసూయ ద్వేషంగా మారిపోయింది. ఇక్కడ ప్రగతిని, ఆకర్షణను ఖతం పట్టించి పెట్టుబడులను అటు మలుపుకోవాలన్న కుతంత్రం ఇన్నాళ్లూ పారలేదు. ఇకపై కూడా ఇట్లానే ఉంటే మునిగిపోతామని తెలిసి రేపటి తెలంగాణను పట్టాలు తప్పించే ఎత్తులు వేస్తున్నారు. ఆ జిత్తులమారి వ్యూహంలో భాగంగానే కేటీఆర్ మీద మూకుమ్మడి మురికిదాడులు జరిగాయి.
మన అస్తిత్వం మీద మంటతో ఉన్న వలసవాద పెంపుడు మీడియాను ఉసిగొల్పారు. అణగిమణగి ఉన్నట్టు నటించిన అవకాశవాద చానళ్లు, పత్రికలు, సోషల్ మీడియా తోడేళ్లు క్రూరమైన, నీచమైన, నీతిమాలిన అజెండాతో ఉన్మాదపు రాతలతో బరితెగించి కేటీఆర్ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయి. అర్థమైందా? మన రేపటిని చీకటిలోకి నెట్టే పన్నాగంలో భాగమే కేటీఆర్ మీద జరుగుతున్న దాడుల పరంపర. తెలంగాణ భావి నాయకత్వాన్ని బలహీనపరిచే దుష్ట ఎత్తుగడలను వేస్తున్నారని తెలుస్తున్నదా, లేదా? మనకు.
ప్రభావం చూపే పలుకుబడి: కేటీఆర్ మీద కక్ష పెరగడానికి ఇంకొన్ని పరిణామాలు, కారణాలూ ఉన్నాయి. కేటీఆర్ గళానికి బలం ఎక్కువ. అందుకే, ప్రత్యర్థికి కేటీఆర్ అంటే భయం ఎక్కువ. ఏదైనా అంశాన్ని ఎత్తుకుంటే దాన్నొక జాతీయస్థాయి చర్చగా చేయగల ప్రభావవంతమైన గొంతు ఆయనది. అదానీ పెట్టుబడులు.. 100 కోట్ల విరాళాల వివాదంపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను చీల్చిచెండాడితే, ఢిల్లీలో అధిష్ఠానాలు అదిరిపడ్డాయి. దెబ్బకు విరాళాలు వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చింది. బహుళ వ్యూహాలతో భవిష్యత్తు రచన చేసుకున్న ప్రణాళిక బెడిసికొట్టడంతో సహజంగానే ఇక్కడి సామంతరాజుకు కేటీఆర్ మీద పట్టరాని ఆగ్రహం కలిగింది. మూసీ మురికి స్కెచ్, హైడ్రా బుల్డోజర్ రాజ్… ప్రతి విషయంలో కేటీఆర్ గట్టిగా నిలబడటం, రోజుకో సెగ తాకి ఢిల్లీ నుంచి చీవాట్లు, మందలింపులు వస్తుండటంతో ప్రతి సందర్భంలో పంటికింద రాయిలా మారిన కేటీఆర్‌పై పగ పెరుగుతూ పోయింది ప్రభుత్వాధిపతులకు.
ఇక్కడ చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సంఘటన ఒకటున్నది. దళిత, గిరిజన, ఇతర అణగారిన వర్గాలపై రాజ్యహింస జరిగినప్పుడు మానవ హక్కుల సంఘాలు, పౌరహక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు తొలుత స్పందించి ఆందోళన చేసి కదిలిస్తే ఆఖరికి రాజకీయపక్షాలు కూడా అందులో చేరుతుంటాయి. కానీ, లగచర్లలో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. అమాయక గిరిజన మహిళలపై జరిగిన అమానుష దౌర్జన్యకాండకు వ్యతిరేకంగా ముందుగా కదిలి, దేశాన్ని కదిలించేలా కార్యక్రమాలు తీసుకున్నారు కేటీఆర్. తర్వాత మెల్లగా ఇక్కడ హక్కుల సంఘాలు, గ్రూపులు మద్దతుగా వచ్చాయి. ఇట్లాంటి సందర్భాలు చాలా అరుదుగా చూస్తుంటాం మనం. ప్రజా ప్రభుత్వ ముసుగును చించి దాని కోరలకు అంటిన నెత్తుటి మరకలను అందరికీ చూపించారు. ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించే పనిలో ఉన్న పాలకులకు కేటీఆర్‌ను దెబ్బ కొట్టాలన్న కసి ఇంకా ఎక్కువైంది.
అక్కడితో అయిపోలేదు కథ. యువతరాన్ని, చదువుకున్న వర్గాలను ఆకట్టుకునే నైపుణ్యం మాత్రమే ఉందిలే, మిగతా సెక్షన్లను మాయచేసి మభ్య పెట్టొచ్చులే అనుకున్నవాళ్లకు కేటీఆర్ కొత్త పాత్రలో సకల జనుల్లోకి చొచ్చుకెళుతున్న తీరు చూసి టెన్షన్ రెట్టింపైంది. ఓటములు, నైరాశ్యం నుంచి బయటపడేసి కార్యకర్తల్లో కదనోత్సాహం నింపుతూ పార్టీని దూకుడుగా నడిపిస్తున్నరు.
తెలంగాణ భవన్ గతంలో ఎప్పుడూ లేనంత సందడి, జనంతో నిండిపోయి కనిపిస్తున్నది. బాధితులకు భరోసా కేంద్రమై నిలబడుతున్నది. రైతాంగం, కార్మికరంగం, ప్రతి వర్గం సమస్యలపై కార్యక్షేత్రంలో దూకి క్లాస్ హద్దులను దాటి మాస్‌తో మమేకమై పవర్ఫుల్ ప్రతిపక్షం అంటే ఇట్లా ఉంటుందని పరిచయం చేశారు కేటీఆర్.
పత్రికలను, చానళ్లను, మెయిన్ స్ట్రీమ్ మీడియాను ప్రలోభాలతో సామ, దాన, భేద దండోపాయాలతో దారికి తెచ్చుకొని ప్రశ్నించే వార్తలకు స్థానం లేకుండా చేశామని సంబురపడ్డారు కాంగ్రెస్ వాళ్లు. కానీ, ఎగవేసిన హామీలను, చేస్తున్న మోసాలను గుర్తుచేయడానికి ఒక దమ్మున్న సోషల్ మీడియా సైన్యాన్ని తయారుచేశారు కేటీఆర్. అడుగడుగునా తప్పులను ఎత్తిచూపుతూ, అబద్ధాల అంతుతేల్చుతుంటే సర్కారుకు చలిజ్వరం పట్టే పరిస్థితి వచ్చింది. కేసులు పెట్టి వేధించారు, జైళ్లల్లో పెట్టి భయపెట్టి గొంతు నొక్కాలని ప్రయత్నం చేసింది ప్రభుత్వం. లీగల్ సెల్ పెట్టి అండగా నిలబడ్డారు, కష్టమొచ్చిన ప్రతి కార్యకర్తను ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు. ఎన్ని విషాలను ప్రయోగిస్తున్నా, ఏదో విరుగుడు కనిపెట్టి తమ పని పడుతూ కొరకరాని కొయ్యగా మారిపోతున్న కేటీఆర్ మీద కోపం ఇంకా పెరిగి, ద్వేషంగా మారిపోయింది.
ఫోన్ ట్యాపింగ్.. కాళేశ్వరం కమిషన్.. ఫార్ములా ఈ కేసు, డ్రగ్స్ అంటూ పూటకో లీకులతో భారీ డైలీ సీరియల్ డైవర్షన్ డ్రామాలు మొదలయ్యాయి. కేటీఆర్‌ను చెడ్డవాడిగా చిత్రించి జనాన్ని నమ్మించడమే లక్ష్యంగా బేతాళ కుతంత్రాలు చెలరేగిపోయాయి. ఇన్నాళ్లు ఈ ప్రచారాలను నమ్మినవాళ్లకు బనకచర్ల జలద్రోహం తర్వాత ఇప్పుడిప్పుడే అసలు అజెండా అర్థమై జ్ఞానోదయం కలుగుతున్నది.
తెలంగాణ సోయి ఉన్నవాళ్ల బాధ్యత ఏంటిప్పుడు?: మన రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడే స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోకపోతే, మిగిలిన అన్ని అస్తిత్వాలు సులభంగా గల్లంతైపోతాయన్న ఎరుక మనకుండాలి. దండయాత్రల నుంచి మన రాష్ర్టాన్ని కాపాడుకో గలిగేది అణ్వాయుధమంత శక్తివంతమైన సొంత రాజకీయ నాయకత్వమే.
అందుకే… తెలంగాణ అణ్వాయుధాన్ని నిర్వీర్యం చేసే పన్నాగాలు అమలుచేస్తున్నారు మాయల ఫకీర్లు. దాన్ని గ్రహించే తెలివి మనకుంటే ఆ నాయకత్వాన్ని కాపాడుకోవడానికి పూనుకోవాలి. మనల్ని దెబ్బకొట్టాలంటే సరిహద్దులను మార్చి మళ్లా సమైక్య రాష్ట్రం తేవాల్సిన పనిలేదు. మనల్ని కూల్చాలంటే మన మీద ప్రత్యక్ష యుద్ధం చేసి ఆక్రమించుకోవాల్సిన పనిలేదు. విజన్ లేని, విషయం లేని మూర్ఖులను అభివృద్ధి అర్థం తెలియని, ఆర్థికచక్రాన్ని ముందుకు తిప్పలేని అసమర్థులను నమ్మి రాష్ర్టాన్ని నడిపించే బాధ్యత అప్పగిస్తే చాలు మనంతట మనమే నాశనమై పోతాం. ఆత్మ వినాశనం వైపు నెడుతున్నారు తెలంగాణ నేలను. మన నాశనమే వాడి ఆశయం జాగ్రత్త.
వేల కిలోమీటర్ల దూరం నుంచి డ్రోన్లు, మిసైల్స్ ప్రయోగించి విధ్వంసం సృష్టిస్తున్న నయా యుద్ధాల కాలంలో ఉన్నాం. శత్రువు మనల్ని తాకలేని విధంగా గగన రక్షణలు, ఎయిర్ డిఫెన్స్‌లు కావాలి. ఆ రక్షణ ఛత్రమే సొంత రాజకీయ పార్టీ. మన పగోడు దాన్నే నిర్వీర్యం చేయాలని చూస్తున్నడు. అది జరిగితే వాడి దాడులకు ఎదురుండదు ఇగ. కేసీఆర్ కుటుంబం మీద, కేటీఆర్ మీద వేస్తున్న అభాండాలు, అపనిందలు, ఆరోపణల వెనక అసలు మర్మం అందరికీ విడమర్చి చెప్దాం. నిన్నటి తెలంగాణకు కేసీఆర్ ఎంత అవసరమో, రేపటి తెలంగాణకు కేటీఆర్ అంతే అవసరం అన్న అవగాహనతో చైతన్యవంతంగా ప్రవర్తించుదాం. కేటీఆర్ అభిమన్యుడు కాదు, అర్జునుడు. పద్మవ్యూహాన్ని ఛేదించగల నేర్పున్నవాడు. జరగబోయేది రాజకీయ రణం కాదు, తెలంగాణ అస్తిత్వ సమరం, అభివృద్ధి కదనం. కేటీఆర్‌కు మనమే బలగమై మరింత బలం ఇద్దాం. జై తెలంగాణ!
కేసీఆర్ కుటుంబం మీద, కేటీఆర్ మీద వేస్తున్న అభాండాలు, అపనిందలు, ఆరోపణల వెనక అసలు మర్మం అందరికీ విడమర్చి చెప్దాం. నిన్నటి తెలంగాణకు కేసీఆర్ ఎంత అవసరమో, రేపటి తెలంగాణకు కేటీఆర్ అంతే అవసరం అన్న అవగాహనతో చైతన్యవంతంగా ప్రవర్తించుదాం. కేటీఆర్ అభిమన్యుడు కాదు, అర్జునుడు. పద్మవ్యూహాన్ని ఛేదించగల నేర్పున్నవాడు. జరగబోయేది రాజకీయ రణం కాదు, తెలంగాణ అస్తిత్వ సమరం, అభివృద్ధి కదనం.