న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియలో అవకతవకలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు మంగళవారం నిరసన తెలపనున్నారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొనకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నిర్ణయించుకోవడంతో ఈ ఉమ్మడి శక్తి ప్రదర్శనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు విపక్ష నాయకులు ర్యాలీ నిర్వహించనున్నారు.
సర్ వివాదానికి సంబంధించి ప్రతిపక్షాలు చేపట్టిన విస్తృత ప్రచారంలో భాగంగా ఈ ర్యాలీ జరగనున్నది. ఈ నిర్ణయాన్ని గత నెలలో రాజధానిలో జరిగిన కూటమి సమావేశంలో తీసుకున్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ సొంత పోరాటాన్ని సాగిస్తున్నందున ఈసీ కార్యాలయం వద్ద మంగళవారం ఇండియా కూటమి చేపట్టే నిరసనలో తాము భాగం కాబోమని తెలిపారు.