Keerthi Jeethuri | నిన్న మొన్నటి వరకూ ‘మీకు కీర్తి తెలుసా?’ అంటే..‘ఓహ్ కీర్తినా? ఏవో పేపర్లు ముందేసుకుని, అవేవో పిచ్చి గీతలు గీస్తుంటుంది’ అంటూ కజిన్స్ వేళాకోళాలు ఆడేవారు. ‘మీ అమ్మాయి ఏం చేస్తుంది?’ అని అడిగితే.. ‘ఆర్కిటెక్ట్’ అని చెప్పాలో, ‘సాఫ్ట్వేర్ ఇంజినీర్’ అని జవాబివ్వాలో తెలియక తండ్రి ఇబ్బందిపడేవారు. అదే ప్రశ్న ఇప్పుడు అడిగితే.. ‘తను ప్రూవ్ చేసుకుంది. కుడోస్ టు కీర్తి’ అంటారు కజిన్స్. ‘నా బిడ్డ ఓ కంపెనీకి సీఈఓ’ అని గర్వంగా చెబుతారు నాన్న. గోడలకు చెవులు ఉంటాయో లేదో కానీ, గోడలతో లాభాలు ఉంటాయని నిరూపించింది హైదరాబాద్‌కు చెందిన కీర్తి జీతూరి.
ఇంటిని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత ఆహ్లాదం, అంతకుమించిన ఆనందం. కాబట్టే, చాలామంది తమ గోడలను ఇష్టమైన వాల్‌పేపర్స్‌తో డిజైన్ చేయిస్తారు. ఈ ట్రెండ్‌ను ఒడిసిపట్టి తన వ్యాపారానికి అనుగుణంగా మలుచుకున్నది కీర్తి జీతూరి. వీహబ్ వేదికగా ‘హౌజ్ ఆఫ్ ఇకారి’ అనే స్టార్టప్‌ను ప్రారంభించి.. నెలల వ్యవధిలోనే దేశ, విదేశాల్లో
వాల్‌పేపర్ డిజైనింగ్ ప్రాజెక్ట్స్ సంపాదించుకున్నది. ఆ ప్రయాణమంతా కీర్తి మాటల్లోనే..
‘హౌజ్ ఆఫ్ ఇకారి’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. బెంగళూరులో ఆర్కిటెక్చర్ సెవన్త్ సెమ్ చదివేటప్పుడే నా వ్యాపార సంస్థకు ‘ఇకారి’ అని పేరు పెట్టాలనుకున్నా. కారణం నాకు ఇక్కత్, కలంకారీ అంటే ఇష్టం. ఈ రెండూ కలిపి ‘ఇకారి’గా నామకరణం చేశాను. గ్రాడ్యుయేషన్ కాగానే హైదరాబాద్ వచ్చేశాను. కొన్ని నెలలు ఇంట్లో నుంచే కరోనా బాధితులకు సాయం చేస్తున్న ఎన్జీఓ కోసం పనిచేశాను. చాలారోజుల వరకూ ఇంట్లోవాళ్లు నేనేదో పిచ్చి గీతలు గీసుకుంటున్నానని అనుకునేవారు. ఫ్రీలాన్స్‌గా చేస్తున్నప్పుడే నా పని విలువ తెలిసింది. ఓ స్నేహితుడు తన మ్యారేజ్ కోసం వెడ్డింగ్ ఇన్విటేషన్ డిజైన్ చేయమని అడిగాడు. తోచినట్టు చేసిచ్చాను. ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆ తర్వాత ‘వెడ్డింగ్ డెకార్’ కంపెనీలో కొన్ని నెలలు ఫుల్‌టైమ్‌గా చేశాను. తర్వాత నేనే సొంతంగా ‘ఇకారి’ స్టార్టప్ ప్రారంభించాను.
‘హ్యాండ్‌మేడ్ ఆర్ట్ వర్క్’తో మేం అందమైన ప్రకృతి చిత్రాలకు వాల్ పేపర్ రూపం ఇస్తాం. ఈ ఆర్ట్‌కు ఆర్కిటెక్చర్, డిజైనింగ్ జతచేసి కస్టమర్‌కు మంచి అవుట్‌పుట్ అందిస్తాం. వాళ్ల ఇంటికి, గోడకు నప్పేలా డిజైన్స్ రూపొందిస్తాం. అందుకోసం సహజమైన రంగుల్నే వాడతాం. లొకేషన్ హైదరాబాద్ అయితే.. నేనే స్వయంగా వెళ్లి కొలతలు తీసుకుంటాను. దూర ప్రాంతాలైతే వీడియో కాల్స్ ఉండనే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, ముంబై, నాగ్‌పూర్, ఢిల్లీ నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తుంటాయి. ఇటీవల యూకే, యూఎస్, ఆస్ట్రేలియాకు కూడా వాల్‌పేపర్స్ పంపాం.
ఇకారి.. పని అంటే ప్యాషన్ ఉన్నవారికి చక్కని వేదిక. ఇక్కడ ఆర్కిటెక్ట్స్, ఫ్యాషన్ డిజైనర్స్, టెక్స్టైల్ నిపుణులు, యానిమేటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, వీడియో ఎడిటర్స్, ఇండియన్ క్రాఫ్ట్స్ గ్రాడ్యుయేట్స్, మల్టీ మీడియా నిపుణులు.. ఇలా రకరకాల నేపథ్యాలవాళ్లు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో పని. హైదరాబాద్ కేంద్రంగా ‘మల్టీ డిసిప్లినరీ స్టూడియో’ను ప్రారంభించనున్నాం. దీన్నొక ఆర్టిస్ట్ కమ్యూనిటీగా మార్చాలనేది నా ఆలోచన. మేం వాల్‌పేపర్ డిజైనింగ్‌తోపాటు వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కూడా చేస్తుంటాం. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు కార్డ్స్, వెడ్డింగ్ టీజర్స్, ఫస్ట్ గ్లింప్స్ వంటివి సిద్ధం చేస్తుంటాం. మా క్రియేటివిటీకి చాలామంది అభిమానులుగా మారారు. సినీ నటుడు నాని భార్య, ఏఆర్ రెహమాన్ కూతురు నా వర్క్ చూసే నన్ను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు. మొదట్లో నా ఫాలోవర్స్ సంఖ్య 200. అదే ఇప్పుడు, ఇరవైవేల మంది. త్వరలోనే హోం టెక్స్టైల్స్ రంగంలోకి వస్తున్నాం. గోడకు తగినట్టు కుషన్స్, కవర్స్, మ్యాచింగ్స్, సోఫా క్లాత్స్ తయారుచేసి విక్రయిస్తాం. ఇంట్లోవాళ్లకు నన్ను మెడిసిన్ చదివించాలని కోరిక. ఇంటర్లో బలవంతంగా బైపీసీలో చేర్పించారు. రెండో ఏడాది చిన్నపాటి తిరుగుబాటు చేసి.. ఎంపీసీకి మారిపోయాను. నా కలల్ని నిజం చేసుకోవడానికి ఆర్కిటెక్చర్ చదివాను. ఈ వృత్తిలోకి వచ్చాక ప్రతిరోజూ కొత్తగా ఆలోచిస్తూ.. ప్రతి పనినీ కొత్తగా ప్రజెంట్ చెయ్యడం అలవాటైంది. కాబట్టే, ఏడాదికాలంలోనే లక్షల టర్నోవర్ సాధించాం.
నా వ్యాపార ఆలోచనకు వీహబ్ మంచి వేదికైంది. ఆఫీస్ స్పేస్ ఇచ్చి మరీ నన్ను ప్రోత్సహిస్తున్నది. వీహబ్ ద్వారా నాకొక కమ్యూనిటీ డెవలప్ అయ్యింది, ఎగ్జిబిషన్లు నిర్వహించగలుగుతున్నా. ఇక్కడికి ఎవరైనా వచ్చినా నా వర్క్స్ చూసి, తెలిసిన వాళ్లకు రెఫర్ చేస్తున్నారు. రూ.4 లక్షల పెట్టుబడితో ఇకారిని ప్రారంభించాను. నా పనిని ఇన్వెస్టర్స్ నమ్మారు. అందుకే వీహబ్ వేదికగా ఓ కంపెనీకి సీఈఓ కాగలిగాను.
– కీర్తి జీతూరి, హౌజ్ ఆఫ్ ఇకారి
…✍ రవికుమార్ తోటపల్లి, 📷 చిన్న యాదగిరిగౌడ్
“అభిరుచినే వ్యాపారంగా చేసుకుని కోట్లు సంపాదిస్తోంది ఈ హైదరాబాద్ అమ్మాయి”
“తొంభై ఏండ్ల యువరక్తం నాది అంటున్న ఈ బామ్మ ఎంతోమందికి ఇన్స్పిరేషన్”