హోడ్కా.. అచ్చమైన మట్టి పరిమళం.. స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణం
భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రదేశాల్లో.. గుజరాత్లోని కచ్ జిల్లా ఒకటి. తెల్లని ఉప్పు నేలలు, ఇసుక తిన్నెలు, ఎండమావులతో నిండిన ఈ ప్రాంతం.. ఎన్నో అద్భుతమైన పల్లెలను తనలో నిలుపుకొన్నది. అలాంటి వాటిలో పర్యాటకుల మనసులను ఇట్టే కట్టిపడేసే అందమైన గ్రామం హోడ్కా. ఆధునిక ప్రపంచపు హడావుడికి దూరంగా, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునేవారికి ఈ పల్లె సరైన వేదిక.
పల్లెటూర్
అచ్చమైన మట్టి పరిమళాన్ని తనలో దాచుకున్న హోడ్కాలో అడుగుపెడితే చాలు.. ఒక్కసారిగా కాలం వెనక్కి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. క్షణకాలంలోనే యాంత్రిక జీవితం నుంచి విముక్తి దొరుకుతుంది. స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణం, అద్భుతమైన పల్లె సంస్కృతి.. ఔరా అనిపిస్తుంది. ఇక ఇక్కడి మట్టి మనుషుల ఆప్యాయత, వారి కళా నైపుణ్యం.. ప్రతి పర్యాటకుడి హృదయంలోనూ చిరస్థాయిగా నిలిచిపోతుంది.
సంప్రదాయ కళలకు నిలయం..
హోడ్కా గ్రామంలో అందరి దృష్టిని ఆకర్షించేవి.. అక్కడి ప్రత్యేకమైన గుండ్రటి ఇండ్లు. వీటిని స్థానికంగా ‘భుంగాలు’ అంటారు. పూర్తిగా మట్టి, గడ్డి, వెదురు వంటి సహజసిద్ధమైన వాటితో వీటిని నిర్మిస్తారు. ఇండ్ల గోడలపై అద్దాల లేపనాలు, అందమైన కుడ్య చిత్రాలు కనువిందు చేస్తాయి. వీటి మరో ప్రత్యేకత ఏమిటంటే.. బయట ఎంతటి ఎండ, వేడి ఉన్నా.. వీటి లోపల మాత్రం వాతావరణం ఎంతో చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

Bhungalu
హస్తకళల అద్భుతం..
హోడ్కా గ్రామం హస్తకళలకు కూడా పెట్టింది పేరు. ఇక్కడి స్థానిక కళాకారులు తమ చేతులతో సృష్టించే అద్భుతాలు.. పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. రంగురంగుల దారాలు, చిన్న అద్దాలతో స్థానిక మహిళలు చేసే ఎంబ్రాయిడరీ వర్క్.. ఎంతో ప్రసిద్ధి చెందింది. దుస్తులు, వాల్ హ్యాంగింగ్లు, కుషన్ కవర్లపై ఈ కళ అద్భుతంగా కనిపిస్తుంది. ఇక సంప్రదాయ పద్ధతిలో తోలుతో తయారుచేసే సంచులు, బూట్లు, అలంకరణ వస్తువులు ఇక్కడ చాలా ప్రత్యేకమైనవి. స్థానిక కుమ్మరి కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకునే మట్టి పాత్రలు, ప్రత్యేకమైన ‘రోగన్ పెయింటింగ్’ ఉత్పత్తులు ఈ గ్రామ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయి.
సరికొత్త అనుభవం..
గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, స్థానిక కళాకారుల ఉపాధిని మెరుగుపరచడానికి హోడ్కాలో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అవన్నీ పర్యాటకులకు సరికొత్త సాంస్కృతిక అనుభవాన్ని అందిస్తాయి. గ్రామాన్ని సందర్శించేవారు సంప్రదాయ భుంగాలలో బస చేయవచ్చు. బజ్రా రోటి, చట్నీలు, కచ్ స్పెషల్ స్వీట్లు లాంటి స్థానిక వంటకాలను ఆస్వాదించవచ్చు. రాత్రివేళల్లో కచ్ సంప్రదాయ సంగీతం, జానపద నృత్యాలు పర్యాటకులను ఎంతగానో అలరిస్తాయి.
ఎలా వెళ్లాలి?
కచ్ జిల్లా కేంద్రమైన భుజ్ నగరానికి 63 కిలోమీటర్ల దూరంలో హోడ్కా గ్రామం ఉంటుంది. ఈ పల్లెను సందర్శించడానికి అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలం అత్యంత అనువైనది. ఈ సమయంలో కచ్ వాతావరణం ఎంతో చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రత్యేకించి.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘రణ్ ఉత్సవ్’ సమయంలో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సమీపంలోని ప్రసిద్ధ ‘వైట్ రన్’ ఉప్పు నేలలను సందర్శించేవారు.. కచ్చితంగా ఈ హోడ్కా గ్రామాన్ని కూడా సందర్శిస్తారు.

Hodka Village 1

Design House

Tradition Dress
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

