Children | ఒక తరం పిల్లలంతా అమ్మమ్మ, నానమ్మల దగ్గరే పెరిగారు. మధ్యలో కొంత అంతరం వచ్చినా, భార్యాభర్తల కొలువుల కారణంగా ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ వస్తున్నది. నిజానికి పిల్లలు అమ్మనాన్నల కంటే అమ్మమ్మ, నానమ్మల దగ్గరే ఎక్కువ సంతోషంగా ఉంటారని తాజా అధ్యయనం చెబుతున్నది.
అమెరికాలోని ఎమోరీ విశ్వవిద్యాలయ పరిశోధకులు, మొత్తం వందమందిపై ఓ అధ్యయనం చేశారు. అమ్మమ్మ, నానమ్మల్ని ల్యాబ్‌లో కూర్చోబెట్టి వాళ్లకు మనవళ్లు లేదా మనవరాళ్ల ఫొటోలు, వీడియోలను స్క్రీన్‌పై చూపించారు. ఆ సమయంలో వాళ్ల మెదడు స్పందనలలో తేడాలను గమనించారు. పిల్లలు బాధగా కనిపిస్తే వీళ్లు ఒత్తిడికి లోనవ్వడం, వాళ్లు సంతోషంగా ఉంటే వీళ్లు ఆనందించడం పరిశోధకుల దృష్టిని దాటిపోలేదు. పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ల అమ్మమ్మ, నానమ్మల ఫొటోలు, వీడియోలు చూపినప్పుడూ.. చిన్నారుల్లో అలాగే జరిగింది. ‘దీనివల్ల పిల్లల మెదళ్లు అమ్మమ్మ- నానమ్మల విషయంలో, అమ్మమ్మ-నానమ్మల మెదళ్లు పిల్లల విషయంలో ఒకేలా స్పందిస్తాయని తేలింది’ అని చెబుతున్నారు న్యూరో సైంటిస్ట్ జేమ్స్ రిల్లింగ్.