హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏకంగా 3.5 లక్షలకు పైగా పడిపోవడం అత్యంత ఆందోళనకరమని విద్యాశాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ పీ సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. స్వయంగా సీఎం రేవంత్రెడ్డి చేతుల్లోనే విద్యాశాఖ ఉన్నప్పటికీ, ప్రభుత్వ విద్యావ్యవస్థ ఇంతటి దయనీయ స్థితికి చేరడం ఆయన పాలనా వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నాటి బీఆర్ఎస్ హయాంలో సరారీ బడుల్లో 30,09,212 మంది విద్యార్థులు చదువుకోగా, ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఆ సంఖ్య ఏకంగా 26,52,162కు తగ్గిపోవడానికి ప్రభుత్వ చేతకానితనమే ప్రధాన కారణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి, వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చించి సరార్ బడులను ఆధునీకరించడంతోపాటు గురుకుల విద్యాసంస్థలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ సంసరణలను కొనసాగించాల్సింది పోయి, విద్యారంగాన్ని అడుగడుగునా నిర్వీర్యం చేస్తూ విధ్వంసకర విధానాలను అవలంబిస్తున్నదని విమర్శించారు. పాఠశాలల సంఖ్యను కుదించేందుకు కుట్రలు పన్నుతూ, పేద విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సరార్ చెలగాటమాడుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్య కల్పించడంలో పూర్తిగా విఫలమైన ఈ పాలకులకు రాబోయే రోజుల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల చేతిల్లోనే గట్టి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.