షాబాద్, అక్టోబర్ 4: భూ సమస్య పరిష్కారం కోసం రెవె న్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఓ పేద రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. తిమ్మారెడ్డిగూడకు చెందిన రైతు వారణాసి యాదయ్య (55)కు తాళ్లపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 483లో నాలుగు ఎకరాల లావణి పట్టా భూమి ఉన్నది. ఇటీవల ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కంపెనీల ఏర్పాటు కోసం టీజీఐఐసీకి అప్పగించింది.
అసైన్డ్ భూములకు పరిహారంగా హెచ్ఎండీఏ లేఅవుట్లో ఎకరాకు 800 గజాల చొప్పున ఇంటి స్థలం కేటాయించే విధానం ఉండగా.. యా దయ్య భూమి ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో కనిపించకుండాపోయింది. దీంతో అధికారులకు విన్నవించారు. ఈక్రమంలో మనస్తాపానికి గురైన యాదయ్య ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. సర్వేనంబర్ 483కు సంబంధించిన భూ రికార్డుల్లో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అర్హులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.