వికారాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నది. ప్రతిఏటా జిల్లాలోని కొడంగల్, తాండూ రు నియోజకవర్గాల్లో నకిలీ పత్తి విత్తనాలు పట్టుపడుతున్నా నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నకిలీ పత్తి విత్తనాల ముఠా కర్ణాటక సరిహద్దు కేంద్రంగా నడుస్తున్నదని పోలీసుల విచారణలో తేలింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన సేడం, గుల్బర్గాలలో నివాసముంటూ నకిలీ పత్తి విత్తనాల దందాను నడిపిస్తూ అక్రమంగా జిల్లాకు వాటిని తరలిస్తున్నట్టు గుర్తించారు. జిల్లాలో గత ఐదారేండ్లుగా కొడంగల్, తాండూరు ప్రాంతాల్లో పట్టుబడిన వారం తా ఆంధ్ర ప్రాంతం వారేనని సమాచారం.
పోలీసుల నిఘా వైఫల్యంతో చెక్‌పోస్టులు నామమాత్రంగా మారిపోయాయి. సరిహద్దుల వద్ద నిఘా పెంచి తనిఖీలు చేయాల్సిన పోలీసులు.. జిల్లాలోకి అక్రమంగా తరలించిన అనంతరం సీజ్ చేస్తూ గొప్పలు చెప్పుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక నుంచి నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్నారనే సమాచారం ఉన్నప్పుడు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఎందుకు నిఘా పెంచడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లా పోలీసుల నిర్లక్ష్యంతో గత ఐదారేండ్లుగా రూ.కోట్ల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను నిందితులు జిల్లాకు తరలిస్తున్నారు. తాజాగా జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీల్లో నకిలీ విత్తనాలతో పట్టుబడి నిందితులు గతంలోనూ నకిలీ విత్తనాలను తరలిస్తూ దొరికిపోవడంతో వారిపై కేసులు నమోదయ్యాయి. పదే పదే దొరికిపోతున్నా వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని జిల్లా రైతాంగం అభిప్రాయపడుతున్నది.
మరోవైపు గతంలో పలుమార్లు నకిలీ విత్తనాలతో పట్టుబడిన వెంకటరమణ అనే ఆంధ్రకు చెందిన వ్యక్తి కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉంటూ నకిలీ విత్తనాల దందాను ప్రతి ఏటా నడిపిస్తున్నారనే ప్రచారమూ జరుగుతున్నది. వెంకటరమణతోపాటు ఆయన అనుచరులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా గతంలో పనిచేసిన జిల్లా పోలీసు అధికారులు రూ.లక్షల్లో వసూలు చేసి చిన్న, చిన్న కేసులు నమోదు చేసి వదిలేశారనే ఆరోపణలున్నాయి. కాగా, కొడంగల్ నియోజకవర్గంలో నకిలీ విత్తనాల దందా కొనసాగించే వారి కుటుంబీకులు ఫర్టిలైజర్ దుకాణాన్నీ కొనసాగిస్తున్నట్టు సమాచారం.
ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతన్నకు ఏదో రకంగా నష్టాలే మిగులుతున్నాయి. అకాల వర్షాలు, సరైన మద్దతు ధర లేకపోవడంతోపాటు నకిలీ విత్తనాలతో చిత్తవుతున్నాడు. నకిలీ పత్తి విత్తనాలతో పంట సాగుకు తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొన్నది. పత్తి రైతు విత్తనాలు మొదలుకొని ఆ పంటను విక్రయించేవరకూ మోసపోతూనే ఉన్నాడు. ప్రతి ఏటా కర్ణాటక నుంచి జిల్లాకు వందల క్వింటాళ్లలో నకిలీ పత్తి విత్తనాలు అక్రమంగా తరలుతున్నాయి. జిల్లాలో 2019 నుంచి ఇప్పటివరకు అధికారికంగా 200 క్వింటాళ్ల వరకు నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేసినా..గుట్టుచప్పుడు కాకుండా వందల క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు జిల్లాలోని అమాయక రైతులకు విక్రయించినట్టు సమాచారం.
2019లో 47.97 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు, 2020లో 4.07, 2021లో 85.72 , 2022లో 24.64, 2023లో 11.45, 2024లో 64, 2025లో రూ.50 లక్షల విలువ చేసే 30 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు సీజ్ చేశారు. తాజాగా కొడంగల్ నియోజకవర్గం రావులపల్లి చెక్‌పోస్ట్ వద్ద యాద్గిర్ జిల్లాలో నివాసముంటున్న ఉప్పలపాటి వసంతరావు అనే వ్యక్తి నుంచి 2.5 క్వింటాళ్ల పత్తి విత్తనాలు, దౌల్తాబాద్ ఠాణా పరిధిలో పునకాల సురేశ్ తదితరుల నుంచి 4.2 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇబ్రహీంపట్నం : వర్షాలు ప్రారంభం కానున్న నేపథ్యం లో రైతులు భూములను సిద్ధం చేసుకుంటున్నారు. ఎరువులు, విత్తనాల కోసం షాపులపైపు పరుగులు తీస్తున్నా రు. ఇదే అదునుగా ఫర్టిలైజర్ షాపులు, దళారులు తమ జేబులు నింపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. నకిలీ విత్తనాలు తీసుకుంటే పెట్టిన పెట్టుబడి రాకపోవడంతోపాటు తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది . అందువల్ల విత్తనాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
విత్తనాలను ప్రభుత్వం నుంచి అనుమతి పొం దిన డీలర్ వద్దే కొనాలి. తప్పనిసరిగా రసీదును తీసుకోవాలి. ప్యాకెట్‌పై కంపెనీ పేరు, సీల్, తయారుచేసిన తేదీ, గడువు ముగిసే తేదీ, తేమశాతం తప్పనిసరిగా చూసుకోవాలి. విత్తనాలు వేసిన అనంతరం డీలర్ ఇచ్చిన రసీదు, విత్తనాల ప్యాకెట్‌కు సంబంధించిన కవర్లను పంట పూర్తయ్యేవరకు జాగ్రత్తగా దాచుకోవాలి. విత్తనాలు డీలర్ నుంచి కొంటే చట్టం ప్రకారం పంటలు నష్టపోయిన రైతులు సంబంధిత కంపెనీ పరిహారం పొందే అవకాశముంటుంది.
వర్షాకాలం పంటల సాగు ప్రారంభమైన నేపథ్యంలో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఫర్టిలైజర్ దుకాణదారులకు అవగాహన కల్పించాం. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు.
-సుజాత, ఏడీఏ, వ్యవసాయశాఖ ఇబ్రహీంపట్నం