పన్నుల దృష్ట్యా క్రిప్టో పెట్టుబడులపై నిపుణులు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను ప్రకటించిన బడ్జెట్లో క్రిప్టో కరెన్సీలపై ప్రతిపాదించిన పన్నులపై ప్రతిపక్షాలతోసహా వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను కేంద్రం తిరస్కరించింది. దీంతో ఏప్రిల్ ఒకటి నుంచి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ద్వారా వచ్చిన లాభాలపై గరిష్ఠంగా 30% పన్నును చెల్లించాల్సి వస్తున్నది. అంతేగాక వచ్చిన నష్టాలపై సాధారణ మినహాయింపులు లేకుండాపోయాయి. ఈ క్రమంలో లాభనష్టాలతో సంబంధం లేకుండా క్రిప్టో కరెన్సీలను అమ్మేసుకుని క్యాపిటల్‌ను వెనక్కి తీసుకోవడమే ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు. ఈ నెలాఖర్లోగానే మదుపు మొత్తాలను వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే 2021-22 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన సాధారణ ఆదాయంగానే పరిగణించి అందుకు తగ్గట్టుగా పన్ను చెల్లించవచ్చంటున్నారు. లేకపోతే ఇన్వెస్టర్ ఆదాయాలతో సంబంధం లేకుండా 30% పన్ను చెల్లించాల్సిందే.