రేక్జావిక్: అగ్నిపర్వతం పేలితే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలుసు. ఎగిసి పడే లావా, దట్టమైన బూడిద కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే వెన్నులో వణుకుపుట్టిస్తోంది. అయితే ఇప్పటి డ్రోన్ కెమెరాల పుణ్యమా అని పేలిన అగ్ని పర్వతాన్ని అతి దగ్గరగా చూసే అవకాశం కూడా దక్కింది. తాజాగా ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్జావిక్కు సమీపంలోని ఫాగ్రడాల్స్జాల్ అగ్నిపర్వతం పేలింది. ఎర్రటి లావా ఏరులై పారుతోంది. దీనిని ఓ డ్రోన్ కెమెరా అతి దగ్గరగా వెళ్లి చిత్రీకరించింది. బోర్న్ స్టీన్‌బెక్ అనే వ్యక్తి ఈ డ్రోన్‌ను అగ్ని పర్వతానికి దగ్గరగా పంపించాడు. ఈ అగ్నిపర్వతం ఎప్పుడు పేలుతుందో తెలియక కొన్ని వారాల ముందు నుంచీ రేక్జావిక్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు.