న్యూఢిల్లీ: కోవాగ్జిన్ బూస్టర్ డోసుతో వ్యాధి నిరోధక శక్తి రెట్టింపు అయినట్లు ఓ స్టడీలో తేల్చారు. బూస్టర్ డోసుతో ఒమిక్రాన్‌తో పాటు అన్ని వేరియంట్లకు వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రెండు డోసుల కోవిడ్ టీకా తీసుకున్న ఆరు నెలల వ్యవధి తర్వాత కోవాగ్జిన్ బూస్టర్ డోసు తీసుకున్న వారిలో ఇమ్యూనిటీ అధికంగా పెరుగుతున్నట్లు ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ నిర్వహించిన అధ్యయనంలో తేల్చారు.
సుమారు 30 ముటేషన్లతో ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర భయాందోళనలు కలిగించిన విషయం తెలిసిందే.టీకా ప్రభావం నుంచి కూడా ఒమిక్రాన్ తప్పించుకోగలదని భావించారు. అధ్యయనంలో భాగంగా 51 మంది సెరాలో ఉన్నయాంటీబాడీలను పరీక్షించారు. రెండవ డోసు తీసుకున్న తర్వాత సేకరించిన నమోనాతో పాటు మూడవ డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత సేకరించిన సెరా నమోనాలను పరిశీలించారు. ఆ రెండు సెరాలపై కోవాగ్జిన్ ప్రభావాన్ని స్టడీ చేశారు.
ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ ఈ జనవరిలో ఆ స్టడీ నిర్వహించాయి. మార్చి 24వ తేదీన ట్రావెల్ మెడిసిన్ జర్నల్‌లో రిపోర్ట్‌ను ప్రచురించారు. బూస్టర్ డోసుతో యాంటీబాడీలు అధిక సంఖ్యలో ఏర్పడినట్లు డాక్టర్ గజానన్ సక్పాల్ తెలిపారు. అన్ని వేరియంట్లపై కోవాగ్జిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు సాక్పాల్ చెప్పారు. BBV152 కోవాగ్జిన్ టీకాతో బీటా, ఒమిక్రాన్ వేరియంట్లతో పాటు అన్ని స్ట్రెయిన్లను నిర్వీర్యం చేసే శక్తి ఉన్నట్లు తేల్చారు.
కొత్త కొత్త వేరియంట్లు ఉద్భవిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోసు సమర్థవంతంగా పనిచేస్తోందని స్టడీలో పేర్కొన్నారు.