మంగుళూరు: కర్నాటకలోని మంగుళూరుకు చెందిన ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థులు కిస్సింగ్ గేమ్ ఆడారు. కాలేజీ దుస్తుల్లో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఒకర్ని ఒకరు కిస్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం కర్నాటకలో వైరల్ అవుతోంది. ఫ్రెండ్స్ చీర్ చేస్తుండగా.. ఓ అబ్బాయి, అమ్మాయి ఒకర్ని ఒకరు ముద్దు పెట్టుకున్నారు. ముద్దులే ఇవ్వాలి.. గట్టిగా ఛుంబనం వద్దంటూ మరో విద్యార్థి అరుస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే ఈ వీడియోను బయటకు రిలీజ్ చేసిన విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆర్నెళ్ల క్రితం ఓ ప్రైవేటు ఫ్లాట్లో జరిగినట్లు సిటీ పోలీసు కమీషనర్ ఎన్ సతీశ్ కుమార్ తెలిపారు. వారం రోజుల క్రితం ఓ అబ్బాయి ఆ వీడియోను వాట్సాప్లో పెట్టాడని, దాంతో అది వైరల్ అయినట్లు పోలీసులు చెప్పారు. విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చిన కాలేజీ యాజమాన్యం ఆ తర్వాత వారిని సస్పెండ్ చేసింది. కానీ ఈ ఘటనపై ఇప్పటి వరకు పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. కిస్సింగ్ పోటీ సమయంలో విద్యార్థులు ఏమైనా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ పోటీలో మొత్తం 8 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దాంట్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.