లాస్ ఏంజిల్స్: పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ బాయ్‌ఫ్రెండ్ సామ్ అస్ఘరిని పెళ్లి చేసుకున్నది. చాలా రహస్యంగా మ్యారేజ్ వేడుకను లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించారు. అయితే ఈ పెళ్లిని అడ్డుకునేందుకు స్పియర్స్ మాజీ భర్త అలెగ్జాండర్ ప్రయత్నించారు. 2004లో జేసన్ అలెగ్జాండర్‌ను బ్రిట్నీ పెళ్లాడింది. కానీ ఆ జంట కేవలం 55 గంటలు మాత్రమే కలిసి ఉన్నారు. అయితే గురువారం పెళ్లి వేదిక వద్దకు తోసుకువెళ్లేందుకు అలెగ్జాండర్ ప్రయత్నించాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న వెంచురా కౌంటీ పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఆమె నా తొలి భార్య అని, నాకున్న ఏకైక భార్య అని పోలీసుల ముందు అలెగ్జాండర్ అరిచినట్లు తెలుస్తోంది. వెడ్డింగ్ కోసం తనకు ఆహ్వానం ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు.
40 ఏళ్ల పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ ఇటీవలే సంరక్షణ కేసు నుంచి బయటపడిన విషయం తెలిసిందే. 13 ఏళ్ల పాటు ఆమె తండ్రి సంరక్షణలోనే ఉన్నారు. సంరక్షణలో ఉండడం వల్ల పెళ్లి చేసుకోలేకపోతున్నానని, పిల్లల్ని కనలేకపోతున్నట్లు బ్రిట్నీ ఓ సందర్భంలో తెలిపింది. పర్సనల్ ట్రైనర్ అస్ఘరితో 2016లో స్పియర్స్‌కు పరిచయం ఏర్పడింది. స్లంబర్ పార్టీ మ్యూజిక్ ఆల్బమ్ రూపొందిస్తున్న సమయంలో ఆ ఇద్దరూ స్నేహితులయ్యారు.