Health | బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న శస్త్రచికిత్స పేరు. మహిళలకు ఇదొక వరం. ఒకప్పుడు ఇలాంటి సర్జరీలు సంపన్న వర్గాలకే పరిమితం. దీంతో, ఈ వైద్య విధానం గురించి సాధారణ ప్రజానీకానికి తెలిసేదే కాదు. పెరుగుతున్న సాంకేతికత, ఆరోగ్య చైతన్యం.. తదితరకారణాల వల్ల బ్రెస్ట్ రీ కన్స్ట్రక్షన్ శస్త్రచికిత్సల సంఖ్య పెరుగుతున్నది.
మనిషి శరీరంలో ప్రతి అవయవమూ ప్రధానమే. దేని ప్రత్యేకత దానిదే. ఏ ఒక్క భాగం లోపించినా దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందులో రొమ్ము ఒకటి. రొమ్ము మహిళ మాతృత్వంలో భాగం, తీరైన ఆకృతికి ఆధారం. కొంతమందికి జన్యుపరమైన సమస్యల కారణంగా పుట్టుకతోనే ఒక రొమ్ము చిన్నగా ఉంటుంది. మరికొందరికి మొత్తానికే ఉండదు. ఉన్నా కూడా రెండూ చిన్నవిగానే ఉంటాయి. దీంతో వైవాహిక జీవితంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. సామాజికంగా కూడా వివక్షకు గురవుతారు. అప్పట్లో వివాహానికి కూడా దూరంగా ఉండేవారు.
ప్రమాదాలు, కాలిన గాయాలు, క్యాన్సర్ లాంటి రుగ్మతలు.. శాశ్వతంగా ఛాతీని దూరం చేస్తాయి. ఆ వెలితి జీవితకాలం వేధించేది. సూటిపోటి మాటలకు కారణం అయ్యేది. లైంగిక జీవితం మీద కూడా ప్రభావం చూపేది. బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అందుబాటులో లేక, ఉన్నాకూడా చికిత్స చేయించుకునే స్తోమత లేక.. జీవితాన్ని నిర్లిప్తంగా గడిపేవారు. కానీ నేడు వైద్యరంగంలో వచ్చిన అధునాతన పద్ధతులకు తోడు ప్రజల్లో పెరిగిన ఆరోగ్య అవగాహన వల్ల బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది.
మూడు సందర్భాలలో..
ప్రధానంగా మూడు సందర్భాలలో బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్స చేస్తారు.
1. రొమ్ము క్యాన్సర్ బాధితులకు.
2. పుట్టుకతోనే రొమ్ము పరిమాణంలో తేడా ఉన్నవారికి.
3. రొమ్ము అసాధారణ పరిమాణంలో ఉన్నప్పుడు.
క్యాన్సర్ బాధితులకు
సాధారణంగా క్యాన్సర్ బాధిత మహిళలకు రొమ్మును పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. రోగి ఆమోదాన్ని, ఆర్థిక స్తోమతను బట్టి.. ఆ ప్రదేశంలో బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ ద్వారా కృత్రిమమైన రొమ్మును అమరుస్తారు. కొంతమందికి ఇంప్లాంట్‌తోపాటు ఫ్లాప్ (కండ) వేస్తారు. పొట్టపై ఉన్న కొవ్వు, రక్తనాళాలతో సహా కండరాలను సేకరించి బ్రెస్ట్ ఇంప్లాంట్ సాయంతో ఫ్లాప్‌తో రొమ్మును పునర్నిర్మిస్తారు. చర్మం సరిగ్గా లేనప్పుడు టిష్యూ ఎక్స్పాండర్ సహకారం తీసుకుంటారు. ఇంప్లాంట్‌తో పాటు ఫాట్ గ్రాఫ్టింగ్ చేస్తారు. ఈ విధంగా రీకన్స్ట్రక్ట్ చేసిన రొమ్ము.. సహజమైన రొమ్ములా పని చేయలేదు. కేవలం ఓ అలంకారంగా ఉంటుంది.
అగ్మెంటేషన్ మామోప్లాస్టీ
కొంతమందిలో జన్యుపరమైన కారణాల వల్ల ఒక రొమ్ము సాధారణ పరిమాణంలో ఉంటుంది.. మరో రొమ్ము చిన్నగా ఉంటుంది. ఇంకొందరిలో ఒక రొమ్ము పూర్తిగా ఉండదు. అంటే, బాల్యం నుంచీ వృద్ధి చెందదు. ఇంకొందరిలో రొమ్ములు రెండూ అతి తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఒకవైపు రొమ్ము పరిమాణంలో తేడా ఉంటే దాన్ని పోలాండ్ సిండ్రోమ్ అంటారు. ఈ సమస్య ఉన్న రోగులకు అగ్మెంటేషన్ మామో ప్లాస్టీ అనే బ్రెస్ట్ ఇంప్లాంట్ ద్వారా చికిత్స చేస్తారు. ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు లేదా కాలిన గాయాలైనప్పుడు కూడా ఈ రకమైన చికిత్స చేస్తారు. లోపం ఉన్న ప్రాంతంలో చర్మం, కండ ఉన్నప్పుడు మాత్రమే ఈ శస్త్ర చికిత్స సాధ్యమవుతుంది. ఛాతీ పరిమాణంలో తేడాలున్న రోగులకు రీకన్స్ట్రక్షన్ తరువాత.. రెండు రొమ్ములూ యథావిధిగా పనిచేస్తాయి.
రిడక్షన్ మామోప్లాస్టీ
కొందరు మహిళల్లో ‘ఫ్యాబ్రో ఎడినోమా’ అనే గడ్డల ప్రభావంతో రొమ్ములు మరీ పెద్దగా ఉంటాయి. ఇతర కారణాల వల్ల కూడా రొమ్ములు అసహజ పరిమాణంలో ఉండవచ్చు. దీనివల్ల ఆరోగ్య సమస్యలతో పాటు సామాజిక ఇబ్బందులూ ఎదురవుతాయి. దీన్ని అధిగమించడానికి ‘బ్రెస్ట్ రిడక్షన్ మామో ప్లాస్టీ’ శస్త్రచికిత్స ద్వారా ఛాతీ పరిమాణం తగ్గిస్తారు. ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శరీర ఆకృతికి తగినట్టు రొమ్ము పరిమాణాన్ని తగ్గిస్తారు. కాకపోతే, రోగులు పాతికేండ్ల లోపు ఉన్నప్పుడు మాత్రమే రిడక్షన్ మామోప్లాస్టీ, బ్రెస్ట్ అగ్మెంటేషన్ మామోప్లాస్టీకి వీలు ఉంటుంది. అదే రీకన్స్ట్రక్షన్ సర్జరీ మాత్రం.. క్యాన్సర్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు. అంటే, సాధారణంగా 50-60 ఏండ్లు పైబడిన మహిళలకే టోటల్ రీకన్స్ట్రక్షన్ అవసరం పడుతుంది.
భయం లేదు..
కొందరు బాలికలు పోలాండ్ సిండ్రోమ్ (ఒకవైపు మాత్రమే ఛాతీ)తో జన్మిస్తారు. ఇలాంటి వారికి యుక్త వయసు తరువాత శస్త్రచికిత్సలు జరిపి, సమస్యను పరిష్కరిస్తారు. రొమ్ము క్యాన్సర్, పోలాండ్ సిండ్రోమ్.. ఈ రెండు పరిమితులకూ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ ఉత్తమ పరిష్కారం. గతంలో, ఇలాంటి సమస్యలున్న మహిళలు వివాహానికి దూరంకావాల్సి వచ్చేది. ప్రస్తుతం, ఆరోగ్య శ్రీ పరిధిలోనూ ఈ సర్జరీలను ఉచితంగా చేస్తున్నారు. నిరుపేద మహిళలు సైతం ధైర్యంగా శస్త్ర చికిత్సకు సిద్ధపడవచ్చు.
రీకన్స్ట్రక్షన్ సర్జరీ.. లాభాలు
…?మహేశ్వర్‌రావు బండారి
డాక్టర్ పలుకూరి లక్ష్మి
ప్రొఫెసర్, ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అండ్
మెడికల్ కాలేజ్, హైదరాబాద్