కళాకారులకు అభిమానులే ఆస్తి. అభిమానుల సంఖ్య పెరిగేకొద్దీ ప్రాచుర్యమూ అధికం అవుతుంది. దాంతోపాటే అవకాశాలూ. కాబట్టే కళాకారులు, అభిమానులు, ఫ్యాషన్.. ఈ మూడింటి మధ్య వారధిగా ఓ సంస్థను స్థాపించారు గాయని దామిని భట్ల.
‘టీషర్ట్ కావచ్చు, టోపీ కావచ్చు. ఇతర యాక్సెసరీస్ కావచ్చు. నాణ్యమైన ఉత్పత్తులను అందించే ఏ బ్రాండ్ అయినా కస్టమర్లను పెంచుకుంటుంది’ అంటారామె. తన సోదరి మౌనిమా చంద్రభట్లతో కలిసి ‘మర్చ్ బెటర్’ అనే పర్సనల్ మర్చంటైజ్ బ్రాండ్‌ను ప్రారంభించింది దామిని. గాయకురాలిగా నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో దక్షిణాదిలో ఇలాంటి బ్రాండింగ్ కంపెనీల కోసం ఆమె ఆరాతీసింది. కానీ, ఫలితం లేకపోయింది. చివరికి, తనే ఓ సంస్థను స్థాపించింది. ప్రసిద్ధ ఆర్టిస్టుల సహకారమూ ఆమెకు తోడైంది.