న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడానికి ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) కింద రూపొందించిన ముసాయిదా జాబితాను ఆధారంగా తీసుకోలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. పరిపాలనా సాఫ్ట్వేర్ వ్యవస్థలు శాసనబద్ధ చట్టాలను అధిగమించలేవని పేర్కొంటూ, విచారణ లేకుండా పేర్లను తొలగించే అధికారాన్ని ఇచ్చే నిబంధనలపై భారత ఎన్నికల సంఘాన్ని గోవా ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయం తమను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని కూడా వ్యాఖ్యానించింది.
ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అమిత్ ఎస్ జమ్సందేకర్, జస్టిస్ వాల్మీకి మెనెజెస్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.విచారణ లేకుండా పేర్లను తొలగించే అధికారాన్ని కల్పించే నిబంధనల గురించి ధర్మాసనం ఈసీఐని ప్రశ్నించింది. చట్టం ప్రకారం ఎటువంటి విచారణ లేకుండా పేర్లను తొలగించేఅధికారం మీకుఎక్కడుందో చూపించండి. అని ప్రశ్నించింది.