Avatar: Fire and Ash | ప్రపంచ సినీ ప్రేమికులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించిన చిత్రాల్లో అవతార్ సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ ఫాంటసీ ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి భాగం సాంకేతికంగా కొత్త ప్రమాణాలు సృష్టిస్తూ హాలీవుడ్ సినిమాల స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ భారీ ఫ్రాంచైజీలో తాజాగా విడుదలైన మూడో భాగం అవతార్: ఫైర్ అండ్ యాష్ గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజువల్స్, గ్రాఫిక్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, గత రెండు భాగాల స్థాయిలో సంచలన విజయాన్ని అందుకోకపోయినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.
ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ఈ సినిమాకు భారీ స్పందన లభించింది. ఇప్పటికే థియేటర్లలో పూర్తి రన్ ముగించుకున్న ఈ సినిమా, డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. తాజాగా చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా ఖరారైనట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ + ఈ సినిమాను జూన్ 24 నుంచి స్ట్రీమింగ్కు తీసుకురానుంది. దీంతో అవతార్ అభిమానులు మరోసారి పండోరా ప్రపంచాన్ని ఇంటి వద్ద నుంచే ఆస్వాదించే అవకాశం దక్కనుంది. అయితే దీనికి ముందు ఈ చిత్రం డిజిటల్ రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మాత్రం సబ్స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా సినిమాను వీక్షించవచ్చు. ఇదే సమయంలో భారతీయ ప్రేక్షకుల కోసం కూడా ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత్‌లో జియో హాట్ స్టార్ వేదికగా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చే అవకాశముందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ ఉండొచ్చని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తానికి థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీలో ఈ విజువల్ వండర్‌ను చూసే అవకాశం దక్కనుంది. జేమ్స్ కేమెరూన్ సృష్టించిన పండోరా ప్రపంచం మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.