కళ్యాణ్ దాసరిని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ సూపర్ హీరో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ‘అధీర’ అనే టైటిల్ను ఖరారు చేశారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా పోస్టర్ను ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కలిసి విడుదల చేశారు. చిన్నప్పటి నుంచి మానవాతీత శక్తులున్న ఓ యువకుడు సమాజహితం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది కథగా ఉంటుందని తెలుస్తున్నది. సినిమాలో విజువల్ ఎఫెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండనుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తామని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం : హరిగౌర, సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర.