సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌కు తల్లిగా (జ్యోతి పాత్రలో) నటించిన చారు శంకర్ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తెచ్చిన గుర్తింపుతో ఆమెకు బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా వివేక్ సోని దర్శకత్వంలో విడుదలైన ‘చాంద్ మేరా దిల్’ చిత్రంలో అనన్య పాండేకు సింగిల్ మదర్‌గా చారు శంకర్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో నటీమణులకు ఎదురవుతున్న టైప్ కాస్టింగ్, సినిమాల ఎంపిక, భవిష్యత్తులో తాను చేయాలనుకునే డ్రీమ్ రోల్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది చారు శంకర్.
‘చాంద్ మేరా దిల్ సినిమాలో అద్భుతమైన ప్రేమకథతో పాటు పాత్రల ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కేవలం ఒక గుడ్డి ప్రేమగా కాకుండా, వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండే పరిణతి చెందిన ప్రేమకథ ఇది. ఇద్దరు వ్యక్తులు తమ జీవితంలో తీసుకునే నిర్ణయాలు, వాటి వల్ల వచ్చే ఇబ్బందులను చకగా చూపించారు’ అని ఆమె వివరించింది. సినీ పరిశ్రమలో నటీమణులను ఒకే తరహా పాత్రలకే పరిమితం చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతాయని చెప్పుకొస్తూ ‘చిత్ర పరిశ్రమ మహిళలను కొన్ని నిర్దేశిత పాత్రల్లోనే ఉంచాలని చూస్తుంది.
కానీ, నేను రూల్స్ పాటించే మనిషిని కాదు’ అంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అంతేకాకుండా ‘ప్రస్తుతం వెండితెరపై తల్లుల పాత్రలు మారడం నాకు సంతోషాన్ని ఇస్తున్నది. ఇప్పుడు సినిమాల్లో తల్లులు కేవలం పిల్లల కోసమే బతికేలా కాకుండా గ్లామరస్‌గా, పవర్‌ఫుల్‌గా అన్ని ఎమోషన్స్ ఉన్న సాధారణ మనుషుల్లా కనిపిస్తున్నారు. నిజం చెప్పాలంటే, ఇది ఒక రకంగా ఎగ్జోటిక్ మదర్స్ ట్రెండ్ నడుస్తున్న కాలం’ అంటూ పేర్కొన్నది.
యానిమల్‌లో జ్యోతి, చాంద్ మేరా దిల్ లో నివేదిత, అంతకుముందు రాకెట్ బాయ్స్ ఓటీటీ వెబ్ సిరీస్‌లో ఇందిరా గాంధీ పాత్ర.. ఇలా తాను చేసిన పాత్రలన్నీ ఎమోషనల్ పవర్‌తో కూడుకున్నవేనని గుర్తుచేసింది. తన డ్రీమ్ రోల్ గురించి చెబుతూ..‘నాకు స్పై థ్రిల్లర్స్, సైకలాజికల్ క్రైమ్ షోలు అంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో ఒక పవర్ఫుల్ విలన్ పాత్ర చేయాలని ఉంది. నేను అద్భుతమైన విలన్ కాగలను.
కానీ, నన్ను చూస్తే ఎవరూ విలన్ అని అస్సలు ఊహించలేరు. అందుకే నెగెటివ్ రోల్స్ చేయాలనుంది. దాంతో పాటు హారర్, యాక్షన్ సినిమాల్లో నటించడం నా డ్రీమ్’ అని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇక మరోవైపు చారు శంకర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటించిన ఎహసాస్, లిల్ ఫిషీస్ లాంటి చిత్రాలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సందడి చేస్తున్నాయి. వీటితోపాటు ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ తెరకెకిస్తున్న ‘అమ్రి’ చిత్రంలోనూ చారు శంకర్ నటిస్తున్నది.