బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్‌కుమార్ నటిస్తున్న చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’. ఢిల్లీని పరిపాలించిన చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మహమ్మద్ ఘోరీ దండయాత్రల నుంచి భారతదేశాన్ని కాపాడిన వీరయోధుడి పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ‘హరి హర్’ అనే మొదటి గీతాన్ని గురువారం అక్షయ్‌కుమార్ విడుదల చేశారు. ఈ పాట తన హృదయాన్ని హత్తుకుందని, దేశభక్తి భావనలు ఉప్పొంగాయని అక్షయ్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఈ పాట పృథ్వీరాజ్ ధైర్యాన్ని, మహా సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. తొలిసారి విన్నప్పుడే ఈ పాటతో ప్రేమలో పడిపోయా’అని అక్షయ్‌కుమార్ చెప్పారు. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకురానుంది.