సినీ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ప్రయాణం అనగానే అందరూ పూలబాట అనుకుంటారు. కానీ, వారి వెనుక ఎన్నో రకాల సవాళ్లు, సొంత నిర్ణయాలు ఉంటాయి. లోకనాయకుడు కమల్ హాసన్, నటి సారికల చిన్న కుమార్తె, శ్రుతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నది. అందులో ఆమె తన జీవితానికి సంబంధించిన పలు సంచలన విషయాలను పంచుకున్నది. ‘నా మొదటి ఉద్యోగం నటన కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ పని కూడా కాదు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించాను. డైరెక్షన్ చేయాలనే లక్ష్యంతోనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ప్రయత్నించకుండా వద్దని ఎలా చెబుతాం అనే ఉద్దేశంతోనే నటనలోకి అడుగుపెట్టాను. భవిష్యత్తులో కచ్చితంగా మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహిస్తాను’ అని అక్షర చెప్పుకొచ్చింది. చాలామంది సెలెబ్రిటీలు తమ పరాజయాలను దాచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, అక్షర మాత్రం తన విద్యాభ్యాసం గురించి ఓపెన్‌గా మాట్లాడుతూ.. హైసూల్ చదువుల్లో తాను అనుకున్నంతగా రాణించలేకపోయానని తెలిపింది.
10వ తరగతి పరీక్షల్లో వరుసగా మూడుసార్లు ఫెయిల్ కావడంతో చదువుపై ఆసక్తి పోయిందని, దాంతో ఇక పాస్ కావడం కష్టమని గ్రహించి చదువుకు స్వస్తి చెప్పినట్లు చెప్పుకొచ్చింది. ‘మేము నటుల పిల్లలం కాబట్టి కచ్చితంగా నటులమే కావాలని నా తల్లిదండ్రులు ఎప్పుడూ ఒత్తిడి తేలేదు. నటన ఇష్టం లేకపోతే వేరే రంగంలో స్థిరపడమని చెప్పారు. మీ మనసుకు నచ్చింది చేయమని చెప్పడమే మాపై ఉన్న పెద్ద బరువును దించింది’ అని చెప్పుకొచ్చింది. సినిమాల విషయంలో తమ ఇంట్లో నిర్మొహమాటంగా విమర్శలు చేసుకుంటామని వెల్లడించింది. నటన బాలేకపోతే ‘చాలా చెత్తగా నటించావు’ అని ముఖం మీదే చెప్పేస్తారని, చిన్న చిన్న తప్పులను తమకే వదిలేసి నేర్చుకోమంటారని అక్షర హాసన్ వివరించింది.