Surya Invited To Oscar Awards | తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘గజిని’ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. ఈ చిత్రంతో తెలుగులో ఈయనకు విపరీతమైన క్రేజ్‌తో పాటు మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పటి నుండి ఈయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్నాయి. ఇటీవలే విడుదలైన విక్రమ్ సినిమాలో సూర్య గెస్ట్ రోల్ పోషించాడు. రోలెక్స్ పాత్రలో కేవలం నాలుగైదు నిమిషాలు మాత్రమే కనిపించిన తన నట విశ్వరూపంతో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించాడు. ఇదిలా ఉంటే ఈయనకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ అకాడమి నుండి సూర్యకు ఆహ్వానం వచ్చింది.
సినీరంగంలో అత్యున్నత పురస్కారంగా భావించేది ‘ఆస్కార్’ అవార్డు. జీవితంలో ఒక్క సారైనా ఆస్కార్‌ను అందుకోవాలని సినీప్రముఖులు ఆరాట పడుతుంటారు. అయితే సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ చిత్రాలు ఆస్కార్ వరకు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా సూర్యకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(ఆస్కార్ 2022) నుండి ఆహ్వానం వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 397మంది కార్యనిర్వాహకుల జాబితాను అకాడమీ విడుదల చేసింది. అందులో సూర్య ఒకడు. ఆస్కార్ కమిటీ సభ్యత్వానికి ఇండియా నుండి సూర్య, కాజోల్కు ఆహ్వానం అందింది. ఆస్కార్ కమిటీలో చేరిన తొలి దక్షిణాది నటుడిగా సూర్య నిలిచాడు.