Ethel | ఇంగ్లండ్‌లోని సర్రేలో నివసిస్తున్న ఎథెల్ కేటర్హామ్ (Ethel Caterham) శుక్రవారం 117వ పుట్టిన రోజు జరుపుకొన్నారు. దీంతో ఎథెల్ ప్రపంచంలోనే అధిక వయసు ఉన్న వ్యక్తిగా నిలిచారు. టైటానిక్ నౌక మునకకు మూడు సంవత్సరాల ముందు, రష్యన్ విప్లవానికి ఎనిమిది సంవత్సరాల ముందు ఎథెల్ జన్మించారు. ఆమె రెండు ప్రపంచ యుద్ధాలు చూశారు. గతేడాది ఏప్రిల్‌లో ప్రపంచంలోనే అధిక వయసు ఉన్న వ్యక్తిగా నిలిచిన సిస్టర్ ఇనా కనబారో లూకాస్ మరణించారు.
2020లో 110 ఏండ్ల వయసులో కొవిడ్ (Covid-19) బారిన పడి కోలుకున్న అత్యంత వృద్ధుల్లో ఆమె ఒకరిగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కారు. హాంప్‌షైర్‌లోని షిప్టన్ బెల్లింగర్కు చెందిన ఆమె తన తల్లిదంద్రుల ఎనిమిది మంది సంతానంలో రెండో వ్యక్తి. కింగ్ ఎడ్వర్డ్ కాలం నాటి ప్రజల్లో జీవించి ఉన్న చివరి వ్యక్తి ఆమె. ఆమె 1927లో 18 ఏండ్ల టీనేజ్ వయసులో ఆమె భారతదేశానికి వచ్చి సైనిక కుటుంబంలోని పిల్లల సంరక్షకురాలిగా పనిచేశారు. 1931లో యూకేలో జరిగిన ఒక విందులో బ్రిటిష్ సైన్యంలో లెఫ్టినెంట్ కర్నల్‌గా పనిచేస్తున్న నార్మన్‌తో పరియం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో వివాహం చేసుకున్నారు. తరువాత వారు హాంకాంగ్‌లో నివసించారు. అక్కడ ఆమె ఒక నర్సరీ స్కూల్‌ను స్థాపించారు.
1976లో భర్త మరణించడంతో బ్రిటన్ (Britain)కు తిరిగి వచ్చి తన కుమార్తెలను పెంచారు. వారు ఇప్పుడు జీవించిలేరు. ముగ్గురు మనుమరాళ్లు, ఐదుగురు మునిమనుమలు, మునిమునమరాళ్లు ఉన్నారు. ఏథెల్ చెల్లెలు గ్లాడిస్ బాబిలాస్ కూడా 104 ఏండ్ల 78 రోజులు జీవించారు. ఎథుల్ కెటర్హామ్ ఇంకో ఐదేండ్లు జీవిస్తే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జీవితకాల వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. ఈ రికార్డు ఫ్రాన్స్‌కు చెందిన జీన్ కాల్మెంట్ పేరిట ఉంది. 1997లో మరణించే నాటికి ఆమె వయసు 122 ఏండ్ల 164 రోజులుగా ఉంది.