కశ్మీర్ ఫైల్స్ తీసి, ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వివేక్ అగ్నిహోత్రి ఒక్కసారిగా వివాదాల్లో చిక్కుకున్నారు. భోపాలీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, చిక్కులు తెచ్చుకున్నారు. వివేక్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. వివేక్ అగ్నిహోత్రి ఏమన్నారంటే.. భోపాలీ అంటే హోమో సెక్సువల్ అని, ఎందుకంటే వారికి ఎక్కువగా నవాబుల లక్షణాలుంటాయని వ్యాఖ్యానించారు. ‘నేను భోపాల్ నుంచి వచ్చాను. కానీ.. నాది నేను భోపాలీ అని చెప్పుకోను. ఎందుకంటే.. దానికో నిర్దిష్టమైన అర్థమే వుంది. ఎవరైనా భోపాలీ అని పిలిస్తే.. ఆ వ్యక్తి హోమోసెక్సువల్ అని అర్ధం. నవాబీ ఫాంటసీలు ఉన్న వ్యక్తి అని అర్థం’ అంటూ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఘాటుగా కౌంటర్ ఇచ్చిన దిగ్విజయ్ సింగ్
భోపాలీలపై అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ కౌంటర్ ఇచ్చారు. ‘అగ్నిహోత్రీ గారూ.. .ఇది మీ అనుభవం కావొచ్చు. కానీ.. భోపాల్ ప్రజలది మాత్రం కాదు. 1977 నుంచి నేను భోపాల్‌లోనే వుంటున్నాను. భోపాల్ ప్రజలతోనే మమేకమయ్యాను. నాకు మాత్రం ఎప్పుడూ ఇలాంటి అనుభవం కాలేదే. మీరెక్కడున్నా…. పక్కన వారి వాసనలు మీ మీద కచ్చితంగా ప్రభావం చూపుతాయి’ అంటూ దిగ్విజయ్ కౌంటర్ ఇచ్చారు.