TVK chief Vijay : తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ (Actor Vijay) డీఎంకే ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కన్యాకుమారి జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే అందించబోయే పాలనా నమూనాను ప్రజల ముందుంచారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.
మహాధనపురంలో జరిగిన సభలో విజయ్ ప్రసంగిస్తూ.. ప్రజలు తమకు హక్కుగా రావాల్సిన పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పనిలేదని, లంచాలు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదని అన్నారు. ప్రభుత్వ పథకాలే నేరుగా మీ ఇంటి తలుపు తడతాయని స్పష్టంచేశారు. దీనికోసం తమిళనాడులోని ప్రతి కుటుంబానికి ఆధార్ తరహాలో ‘ప్రయారిటీ కార్డ్’ జారీ చేస్తామన్నారు. ఈ కార్డులో కుటుంబ సమగ్ర సమాచారం ఉంటుందని, తద్వారా పుట్టినప్పటి నుంచి అన్ని సంక్షేమ ఫలాలు సజావుగా అందుతాయని వివరించారు.
ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి తీవ్రస్థాయిలో ఉందని, కింది స్థాయి అధికారుల నుంచి మంత్రుల వరకు లంచాలు వెళ్తున్నాయని విజయ్ అన్నారు. తాను చెప్పేవి కట్టుకథలు కావని, సాంకేతికతతో శాస్త్రీయంగా అమలు చేయగల ప్రణాళికలని స్టాలిన్‌ను ఉద్దేశించి అన్నారు. టీవీకే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ‘తమిళనాడు ప్రభుత్వ సేవా పథకం’ అమలు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకేచోట అందించేందుకు ‘వెట్రి తమిళనాడు సూపర్ యాప్’ అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొస్తామన్నారు.
పాలనలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తామని, 10 లక్షల మంది మద్దతిచ్చిన ప్రజా వినతులను అసెంబ్లీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అప్పు రూ.10.05 లక్షల కోట్లు దాటిందని ఆందోళన వ్యక్తం చేసిన విజయ్, పన్నులు పెంచకుండానే ఆదాయాన్ని పెంచుతామని తెలిపారు. టీవీకే ప్రభుత్వం వస్తే తమిళనాడును దేశానికే డిజిటల్ రాజధానిగా మార్చి, ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.