Champai Soren: జార్ఖండ్ క్యాబినెట్‌ను మరో రెండు మూడు రోజుల్లో విస్తరించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ చెప్పారు. అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన అనంతరం మీడియా మాట్లాడిన ఆయన.. ‘క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు..?’ అన్న మీడియా ప్రశ్నకు పైవిధంగా సమాధానం ఇచ్చారు.
మాజీ సీఎం హేమంత్ సోరెన్ తయారు చేసిన సంక్షేమ పథకాల బ్లూ ప్రింట్ శరవేగంగా పనిచేస్తుందని అన్నారు. ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ‘కొందరు జేఎంఎం ఎమ్మెల్యేలు పార్టీ వీడనున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారుగా..’ అని మీడియా ప్రతినిధులు సందేహం వెలిబుచ్చగా.. అది వారి అలవాటు అని అన్నారు.
మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వారు ఆ విధంగానే ప్రభుత్వాలను కూల్చారని చంపాయ్ సోరెన్ ఎద్దేవా చేశారు. అలాంటి సంస్కృతి, సంప్రదాయాలకు తాము చాలా దూరమని చెప్పారు. జేఎంఎం నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే బయటికి వెళ్లరని చెప్పారు.