Volcano eruption : మధ్య అమెరికా (Centrel America) లోని గ్వాటెమాలా (Guatemala) లో వోల్కన్ డీ ఫ్యూగో (Volcan Defugo) అగ్నిపర్వతం బద్ధలైంది. దాంతో అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగజిమ్మాయి. ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు పొగలు విరజిమ్మాయి. అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగజిమ్మి, మండుతున్న రాళ్లు బుల్లెట్లలా దూసుకొచ్చాయి. దాంతో ఆ పర్వత పరిసరాల్లో ఉన్న పర్యాటకులు (Tourists) ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ హఠాత్పరిణామానికి (Hikers) సైతం పరుగందుకున్నారు.
అగ్నిపర్వతం చుట్టూ శిథిలాలు పడుతుండగా పర్వతారోహకులు అగ్నిపర్వత మార్గాల వెంట పరుగెత్తుతుండటం కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఒక వీడియోలో ఒక పర్యాటకుడు ‘ఓరి దేవుడా, ఇది మరీ దారుణం. పరుగెత్తండి, పరుగెత్తండి..!’ అని అరుస్తూ పరుగులు తీశాడని తెలిపారు. ఒక పర్యాటకుడు కుక్కను పట్టుకుని సురక్షిత ప్రదేశానికి తీసుకువెళుతుండగా.. మరికొందరు కింద పడుతున్న శిథిలాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నించినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.
కాగా, గ్వాటెమాల నగరానికి నైరుతి దిశలో సుమారు 43 కిలోమీటర్ల దూరంలో ఈ వోల్కాన్ డి ఫ్యూగో అగ్నిపర్వతం ఉన్నది. గ్వాటెమాలాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతంగా ఇది పరిగణించబడుతుంది.