ముంబై (నమస్తే తెలంగాణ): బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి బయట ఆదివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ముంబైలోని సల్మాన్ నివాసమైన గెలాక్సీ అపార్ట్మెంట్స్ ఎదురుగా తెల్లవారుజామున 5 గంటలకు బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్లపాటు కాల్పులు జరిపారు. ఇది జరిగినప్పుడు సల్మాన్‌ఖాన్, ఇతర కుటుంబ సభ్యులు అంతా ఇంట్లోనే ఉన్నారని తెలిసింది. తాజా ఘటనతో అక్కడ కలకలం రేగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్రైం బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి, దర్యాప్తు ప్రారంభించారు. తుపాకీ కాల్పులు జరిపింది తామేనని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ప్రకటించాడు. ఈ మేరకు సోషల్‌మీడియాలో సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించాడు.