Viral news : ముంబై (Mumbai) లోని ఓ హోటల్లో.. దోశలో చచ్చిన ఎలుక (Deat rat) వచ్చిన ఘటనకు సంబంధించిన కేసులో ట్విస్ట్ (Twist) చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళే బ్లాక్ మెయిలర్ (Black Mailer) గా అరెస్ట్ అయ్యింది. హోటల్ యజమానిని బ్లాక్మెయిల్ చేసి నగదు తీసుకుంటూ పట్టుబడింది. హోటల్ యజమాని (Hotel Owner) నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ ఘటన ముంబైలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని బోరివలీ ప్రాంతంలో ఉన్న రాధాకృష్ణ హోటల్‌కు సెప్టెంబర్ 24న మాన్సీ ఆచార్య (36) అనే మహిళ మరో ఇద్దరు వ్యక్తులు, ఓ చిన్నారితో కలిసి వెళ్లింది. వారు ఆర్డర్ చేసిన మైసూర్ మసాలా దోశలో చనిపోయిన ఎలుక కనిపించిందని ఆమె ఆరోపించింది. అప్పటికే తన సోదరుడు కొంత దోశ తిన్నాడని, ఎలుకను చూసి షాక్‌కు గురై వెంటనే వాంతి చేసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నది.
ఈ ఘటనపై ఆమె బోరివలీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ అధికారులు సెప్టెంబర్ 28న ఆ హోటల్ లైసెన్సును సస్పెండ్ చేశారు. దాంతో హోటల్ మూసివేత అంచుకు చేరిందని యజమాని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. హోటల్ యజమానికి, ఆయన బంధువులకు గుర్తుతెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి.
వీడియోను మరింత వైరల్ చేయకుండా ఉండాలంటే రూ.25 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. నిరంతర ఫోన్ కాల్స్‌తో మానసికంగా వేధించడంతో చివరికి రూ.6 లక్షలకు ఒప్పందం కుదిరింది. అప్పటికే యజమాని వారికి రూ.1 లక్ష నగదు ఇచ్చారు. అనంతరం సెప్టెంబర్ 29న హోటల్ యజమాని బోరివలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితులను పట్టుకోవడానికి వల పన్నారు. మహిళ డబ్బు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.