Rahul Gandhi : ఢిల్లీలో హైడ్రామా కొనసాగుతోంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఇండియా బ్లాక్ ఎంపీలతో కలిసి కాంగ్రెస్ అగ్రనేతలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వరుసగా రెండో రోజు కూడా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వంటి నేతలు ఆందోళన చేస్తుండగా.. వారిని మరోసారి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీపంలో రాహుల్, ప్రియాంకా సహా పలువురు నేతల్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికే మంగళవారం రాత్రి కూడా వారిని పోలీసులు అరెస్టు చేసి, అనంతరం విడిచిపెట్టారు. ఇప్పుడు బుధవారం కూడా ఆందోళన చేపట్టేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. ఇండియా బ్లాక్ ఎంపీలు మంగళవారం కూడా ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేసేందుకు ఎంపీలు బయల్దేరారు. అయితే, వీరిని పోలీసులు అడ్డుకున్నారు. జంతర్ మంతర్ వద్దకు వెళ్లకుండా అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ప్రియాంకా గాంధీని పోలీసులు అడ్డుకోవడంతో ఆమె రోడ్డుపైనే దీక్షకు దిగారు.
అయితే, ఆమెను అక్కడ్నుంచి దీక్ష విరమించాల్సిందిగా పోలీసులు కోరారు. దీంతో ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తనతో దారుణంగా వ్యవహరించారని ప్రియాంకా ఆరోపించారు. తన ఒంటిపై గీరుకుపోయిన గాయాలయ్యాయని తెలిపారు. ఢిల్లీలో వరుసగా ఇండియా బ్లాక్ నేతలు ఆందోళనకు దిగడం.. తర్వాత వారిని అరెస్టు చేయడం.. ఓ సీరియల్లా సాగుతోంది.