Leander Paes : భారత టెన్నిస్ దిగ్గజం (Tennis Legend) లియాండర్ పేస్ (Leander Paes) బెంగాలీ కాదంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. తాను సౌరవ్ గంగూలీ (Saurav Ganguly) ని కాదేమోగానీ కచ్చితంగా బెంగాలీనే అని చెప్పారు. పశ్చిమబెంగాల్ (West Bengal) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో ఇటీవల బీజేపీలో చేరిన పేస్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ‘మీరు బెంగాలీయేనా’ అనే ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. దీనపై పేస్ స్పందిస్తూ.. మీరు బెంగాలీయేనా అనే ప్రశ్న ఎదురైనప్పుడు తనకు చాలా బాధగా ఉంటుందని అన్నారు.
అయితే తన కుటుంబానికి పోర్చుగీస్ మూలాలు ఉన్నాయని తెలిపారు. తనవి మాత్రం భారతీయ మూలాలే అని స్పష్టంచేశారు. తాను కోల్కతాలో పుట్టానని, తన టెన్నిస్ ప్రయాణం సౌత్ క్లబ్లో ప్రారంభమైందని చెప్పారు. ఇక్కడి లా మార్టినియర్ పాఠశాలలో చదువుకున్న తాను, కోల్కతా నగర మైదానాల్లోనే ఆడుకున్నానని అన్నారు. ఈ నగరానికి గొప్ప క్రీడా చరిత్ర ఉందని కొనియాడారు. కానీ ప్రస్తుత బెంగాల్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడం లేదని విమర్శించారు.
పోయిన సంవత్సరం అర్జెంటినా ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ కోల్కతాలో పర్యటించిన సమయంలో చోటుచేసుకున్న గందరగోళాన్ని ఈ సందర్భంగా పేస్ ప్రస్తావించారు. బెంగాల్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించలేదని ఆరోపించారు. క్రీడారంగానికి చెందినవారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని అభిప్రాయపడ్డారు.