Thali cost : గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోల్చితే ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో నాన్వెజ్ థాలి (Non Veg Thali) ధర 1 శాతం తగ్గింది. అదే సమయంలో వెజ్ థాలి (Veg Thali) ధర మాత్రం యథాతథంగా ఉంది. ఈ విషయాన్ని క్రిసిల్ రిపోర్టు వెల్లడించింది. క్రిసిల్ రిపోర్టు ప్రకారం.. గత ఏడాది నాలుగో త్రైమాసికంతో పోల్చితే ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో బ్రాయిలర్ చికెన్ (Broiler Chicken) ధర రెండు శాతం తగ్గడం.. ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ధరలు కూడా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది తక్కువగా ఉండటం నాన్ వెజ్ థాలి ధర తగ్గడానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక గత ఏడాది కంటే ఈ ఏడాది ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ధర తక్కువగా ఉన్నప్పటికీ.. టమాటా ధరల్లో పెరుగుదల కనపించిందని, అదేవిధంగా గ్యాస్ ధరలు, వంట నూనె ధరలు పెరిగాయని, దాంతో వెజ్ థాలీ ధరలు పెరగకుండా, తగ్గకుండా స్థిరంగా ఉన్నాయని క్రిసిల్ పేర్కొన్నది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది కూరగాయల ధరలు 33 శాతం పెరిగాయని తెలిపింది. 2025 మార్చిలో సగటున కిలో కూరగాయల ధరలు రూ.21 ఉండగా.. ఇప్పుడు అది రూ.28కి చేరిందని పేర్కొన్నది.