ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్( Aryan Khan ) మరిన్ని చిక్కుల్లో పడ్డాడు. ముంబై కోర్టు అతనికి సోమవారం వరకూ ఎన్సీబీ కస్టడీ విధించగా.. ఈనెల 11 వరకూ దానిని పొడిగించాలని ఎన్సీబీ కోర్టును కోరింది. ఆర్యన్ ఖాన్ ఫోన్లో ఫొటోల రూపంలో ఈ నేరానికి సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. అంతర్జాతీయ డ్రగ్స్ అక్రమ రవాణాతో ఈ కేసుకు లింకు ఉందని ఈ ఫొటోల ద్వారా తేలిందని ఈ సందర్భంగా ఎన్సీబీ వాదించింది. డ్రగ్స్‌ను భారీగా సేకరించి పంపిణీ చేసే పనిలో ఉన్నట్లు కూడా కోర్టుకు చెప్పింది. తాము జరిపిన దాడుల్లో సప్లయర్ దగ్గరి నుంచి భారీ మొత్తాల్లో డ్రగ్స్ దొరికినట్లు వెల్లడించింది.