న్యూఢిల్లీ, మే 21: సౌందర్యం కోసం ఉపయోగించే ఏ ఉత్పత్తి అయినా ఇంజెక్షన్ రూపంలో ఉండకూడదని దేశ అత్యున్నత ఔషధ నియంత్రణ సంస్థ సూచించింది. చర్మరక్షణ ప్రక్రియలో ఇటీవల బొటాక్స్, గ్లుటాథియోన్ వంటి సమ్మేళనాలు బాగా ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో ఈ హెచ్చరికను జారీచేసింది. వినియోగదారులైనా, నిపుణులైనా, సౌందర్య చికిత్సాలయాలైనా సౌందర్య సాధనాన్ని ఇంజెక్షన్ రూపంలో ఉపయోగించడానికి వీలులేదని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) స్పష్టంచేసింది.
సౌందర్య సాధనాలేవైనా సరే అవి మానవ శరీరంపై రుద్దడానికి, పోయడానికి, చల్లడానికి లేదా పిచికారీ చేయడానికి మాత్రమే ఉద్దేశించినవని వివరించింది. వాటిని ఇంజెక్షన్ రూపంలో మానవ శరీరంలోకి పంపడం ద్వారా తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతున్నాయని తెలిపింది. చాలాచోట్ల సౌందర్య చికిత్సాలయాల్లో నైపుణ్యంలేని వారు ఇటువంటి ప్రయోగాలకు దిగుతూ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది.