న్యూఢిల్లీ, ఆగస్టు 5: సూపర్ ఎల్ నినో ప్రభావం రానున్న నెలల్లో మరింత ఉధృతం కానున్నది. ఆగస్టులో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమై అక్టోబర్ వరకు కొనసాగుతాయని నిపుణులు తెలిపారు. రానున్న వారాల్లో ఎల్ నినో తీవ్రతరం కావడంతో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని ఐక్యరాజ్యసమితి ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) పేర్కొంది. భారత్‌లో ఈ రుతుపవన కాలంలో వర్షపాత తీరును ప్రభావితం చేసే ప్రధాన కారకం ఎల్ నినో. రుతుపవన వర్షపాతం దీర్ఘకాల సగటు(ఎల్పీఏ)లో సుమారు 92 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఇది సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉండే సీజన్‌ను సూచిస్తున్నది. మధ్య, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు, వాయువ్య భారత్‌లోని కొన్ని భాగాలు తేమ కొరత ప్రమాదంలో ఉన్నాయి. ఈశాన్యంలోని అస్సాం గత కొన్నేండ్లలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన వరదలతో పోరాడుతున్నది.
నిప్పుల కొలిమిలా ఐరోపా
ఎల్ నినో ప్రభావంతో ఐరోపా ఇప్పటికే అనేక వడగాలులను చవిచూసింది. భారత్‌లో రుతుపవన చక్రం దెబ్బతినగా ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలు తీవ్ర ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నాయి. రానున్న రోజుల్లో దీని ప్రభావం మరింత ఉగ్రరూపం దాల్చనున్నది. ఎల్ నినో కేవలం మన గుమ్మం వద్దే లేదు. అది మన ఇంటి లోపలకు వచ్చి ఉష్ణోగ్రతలను పెంచుతున్నది అని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని హెచ్చరించిన ఆయన ఎల్ నినో మరింత బలపడుతున్నది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు, వినాశకరమైన కార్చిచ్చులు, రికార్డు స్థాయి సముద్రపు వేడితో అట్టుడికిపోతున్న భూమికి ఇది మరింత ఆజ్యం పోస్తున్నది అని పేర్కొన్నారు. ముఖ్యంగా ఐరోపా అంతా ఒక నిప్పుల కొలిమిలా మారిపోయింది. ఫ్రాన్స్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్ద ప్రాంతాలను కార్చిచ్చులు చుట్టుముట్టాయి. బోర్డోలో చెలరేగిన ఒక భారీ అగ్నిప్రమాదం కారణంగా మెరుపులు, ఉరుములతో నిండిన ఒక మేఘం ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత తీవ్రమైన అగ్నిప్రమాద సంక్షోభంగా పేర్కొంటూ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్
మాక్రాన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో 2 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇండ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. డెన్మార్క్, జర్మనీ, పోలాండ్ దేశాలు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి. జూలై చివరి నాటికి యూరోపియన్ యూనియన్ వ్యాప్తంగా 4.35 లక్షల హెక్టార్లకు పైగా భూమి అగ్నికి ఆహుతైంది. దీంతో ఇది రికార్డు స్థాయిలో అత్యంత తీవ్రమైన అగ్ని ప్రమాద కాలాలలో ఒకటిగా నిలిచింది.
మండుతున్న అమెరికా
అమెరికాలో కూడా అధిక ఉష్ణోగ్రతలు, వేడి పరిస్థితులు నెలకొన్నాయి. ఉటాలోని సాల్ట్ లేక్ సిటీలో ఉష్ణోగ్రతలు 42.8 డిగ్రీల సెల్పియస్‌కు చేరుకున్నాయి. ఉత్తర కరోలినాలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి. పశ్చిమ, గ్రేట్ ప్లెయిన్స్ ప్రాంతాలను తీవ్రమైన వడగాలులు చుట్టుముట్టగా దక్షిణ, మధ్య ప్రాంతాలలో ఈ సీజన్ ఆరంభంలోనే తీవ్రమైన కరువు ఏర్పడింది. కొలరాడో, ఇడాహూ, మోంటానా, నెవాడాలలో వేసవిలో పిడుగుపాట్లు, అగ్నిప్రమాదాలు సంభవించాయి.