న్యూఢిల్లీ, జూలై 1: కారులో షికారుకెళ్లి.. నేల మీద షికారు బోర్ కొడితే అదే కారుతో గాలిలో చక్కర్లు కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఎగిరే కారు తయారు చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. బుధవారం స్లొవేకియాలో ‘ఎయిర్‌కారు’ నమూనాను 35 నిమిషాల పాటు గాలిలో నడిపించారు. రెండు నగరాల మధ్య టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. ప్రయోగం విజయవంతం కావడంతో వచ్చే వారం నుంచి ఎగిరే కార్ల ఉత్పత్తిని ప్రారంభిస్తారని భావిస్తున్నారు. మంగళవారం నిత్రా ఎయిర్ పోర్టులో టేకాఫ్ అయిన కారు బ్రతిస్లావా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. రెండు నిమిషాల 15 సెకండ్లలో తిరిగి కారుగా రూపాంతరం చెంది రోడ్లపై రయ్‌మని దూసుకెళ్లింది. కారు ఎయిర్ క్రాఫ్ట్‌గా మారాలన్న రెండు నిమిషాల సమయమే తీసుకొంటుంది. కారు రూపకర్త అయిన స్టెఫాన్ క్లీన్ స్వయంగా టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు.
ఇద్దరు ప్రయాణించవచ్చు
స్లొవేకియాకు చెందిన క్లీన్ విజన్ అనే కంపెనీ ఈ కారును తయారు చేసింది. కారు తది నమూనా తయారు కావడానికి రెండేండ్లు పట్టింది. రూ.17.69 కోట్లు ఖర్చు అయింది. ఎయిర్కారులో బీఎండబ్ల్యూ ఇంజన్ వాడారు. పెట్రోల్‌తో నడుస్తుంది. ఇది 8,200 అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. ఇది ఏకధాటిగా 40 గంటల పాటు గాలిలో ఎగురుతూ 1,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. టెస్ట్ డ్రైవ్‌లో గాలిలో ఇది గంటకు 170 కిలోమీటర్ల వేగం అందుకొన్నట్టు క్లీన్ చెప్పారు. కారులో ఇద్దరు ప్రయాణించవచ్చు. అయితే నేల నుంచి అమాంతం గాలిలోకి ఎగరలేదు. రన్ వే ఉండాలి. ల్యాండ్ కావాలన్నా అంతే.