BJP | బీజేపీకి యూపీ బుగులు.. పార్టీకి తలనొప్పిగా అంతర్గత విభేదాలు
లోక్సభ ఎన్నికల ఫలితాల షాక్తో ఉత్తరప్రదేశ్ బీజేపీలో బయటపడ్డ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య వైరం రచ్చకెక్కింది.
- రాష్ట్రంపై సడలుతున్న పార్టీ పట్టు
- సీఎం యోగి, డిప్యూటీ సీఎం మౌర్య మధ్య విభేదాలతో పార్టీకి తలనొప్పి
- 27న ప్రధానితో యోగి సమావేశం
- అమిత్షా, నడ్డాతోనూ భేటీ
- విభేదాలు చల్లార్చేందుకు రంగంలోకి ఆరెస్సెస్
BJP | న్యూఢిల్లీ/లక్నో, జూలై 21: లోక్సభ ఎన్నికల ఫలితాల షాక్తో ఉత్తరప్రదేశ్ బీజేపీలో బయటపడ్డ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య వైరం రచ్చకెక్కింది. గత ఆదివారం జరిగిన రాష్ట్ర పార్టీ సమావేశంలో యోగి మాట్లాడుతూ అతి విశ్వాసం వల్లే రాష్ట్రంలో తక్కువ ఎంపీలు సీట్లు వచ్చాయని పేర్కొనగా.. అదే సమావేశంలో పాల్గొన్న మౌర్య మాట్లాడుతూ ‘పార్టీ కంటే ఎవరూ పెద్ద కాదు. ప్రభుత్వం కూడా పార్టీ కంటే ఎక్కువ కాదు’ అని యోగిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో పార్టీలో నెలకొన్న విభేదాలు బయటపడ్డాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగినట్టుగా తెలుస్తున్నది.
ఇందులో భాగంగా ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలో సమావేశమవుతారని పార్టీ, ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నీతిఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి పాల్గొనే నిమిత్తం ఢిల్లీ వెళ్లనున్న సీఎం యోగి.. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలుస్తారని తెలిపాయి. యూపీ బీజేపీలో విభేదాల నేపథ్యంలో ఈ భేటీలకు ప్రాధాన్యం సంతరించుకొన్నది. లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ సీట్లు 2019లో వచ్చిన 62 సీట్ల నుంచి 33కు పడిపోయిన విషయం తెలిసిందే. రాష్ట్రంపై బీజేపీ పట్టు క్రమంగా సడలుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
మోదీకి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నివేదిక
యూపీ బీజేపీలో అగ్రనేతల మధ్య విభేదాలు ముదిరిన వేళ.. రాష్ట్ర పార్టీ సమావేశం జరిగిన ఈనెల 14కు మూడు రోజుల తర్వాత డిప్యూటీ సీఎం మౌర్య, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి ఢిల్లీలో నడ్డాతో సమావేశమయ్యారు. భూపేంద్ర చౌదరి ప్రధాని మోదీని కూడా కలిశారు. లోక్సభ ఎన్నికల్లో పలువురు నేతలు క్రియాశీలంగా పనిచేయలేదని, కొన్ని జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదని ఆయన ప్రధానికి ఒక నివేదిక సమర్పించినట్టు తెలిసింది. మరోవైపు జిల్లాల ఇన్చార్జి మంత్రులతో సమావేశమైన సీఎం యోగి ఆదిత్యనాథ్.. త్వరలో రాష్ట్రంలో జరిగే 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు సిద్ధమవ్వాలని సూచించారు.
రాష్ట్ర నేతలతో ఆరెస్సెస్ సంప్రదింపులు
యూపీ బీజేపీలో నెలకొన్న విభేదాల మంటలను చల్లార్లేందుకు ఆ పార్టీ సైద్ధాంతిక మాతృసంస్థగా భావించే ఆరెస్సెస్ రంగంలోకి దిగింది. విభేదాలను పరిష్కరించేందుకు అగ్రనేతలను రంగంలోకి దించినట్టు తెలుస్తున్నది. సీనియర్ వీహెచ్పీ ఆఫీస్ బేరర్ రాజీవ్ శ్రీవాస్తవ రాష్ట్ర బీజేపీ, ప్రభుత్వంలోని పలువురు పెద్దలతో సమావేశమైనట్టు సమాచారం. విభేదాలను పరిష్కరించుకోవాలని వారు సూచించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. తూర్పు యూపీకి చెందిన ఓ సీనియర్ ప్రచారక్ కూడా కేశవ్ ప్రసాద్ మౌర్యతో ఆయన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఆయన ఇతర నేతలతో కూడా మాట్లాడినట్టు తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

