న్యూఢిల్లీ: వంధ్యత్వ (సంతానలేమి) సమస్య ఉన్న పురుషుల కుటుంబాలకు క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టుగా అమెరికాకు చెందిన పరిశోధకులు గుర్తించారు. ఉటా యూనివర్సిటీలోని హంట్స్మన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు.. ఉటా పాపులేషన్ డాటాబేస్కు చెందిన ప్రజారోగ్య, జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని తేల్చారు. పరిశోధనలో భాగంగా వంధ్యత్వం ఉన్న పురుషుల తల్లిదండ్రులు, తోబుట్టువులు, దగ్గరి బంధువులను సైతం పరీక్షించారు. వీరి కుటుంబాలకు పెద్ద ప్రేగు, వృషణాల, ఎముక సహా ఇతర క్యాన్సర్ ముప్పు ఎక్కువ ఉన్నట్టుగా పరిశోధకులు తేల్చారు. కాగా, వంధ్యత్వ సమస్య ఉన్న పురుషుల కుటుంబాలకు క్యాన్సర్ ముప్పు ఎక్కువ ఉన్నట్టు గుర్తించినప్పటికీ, ఇందుకు కారణాలను పసిగట్టేందుకు మరింత అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు.