BookMyShow | బుక్ మై షో (BookMyShow) సీఈవో, సహ వ్యవస్థాపకుడు అశీష్ హేమరాజని (Ashish Hemrajani) చిక్కుల్లో పడ్డారు. బ్రిటిష్ రాక్ బ్యాండ్ (British rock band Coldplay) ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి బ్లాక్ టికెట్లు విక్రయించినట్లు ( black marketing of tickets ) ఆయనపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయనకు ముంబై పోలీసులు తాజాగా మరోసారి సమన్లు జారీ చేశారు.
టికెట్ల వ్యవహారంపై వివరణ కోరుతూ ముంబై పోలీసు ఎనకామిక్ అఫెన్సెస్ వింగ్ శనివారం అశీష్తో పాటు కంపెనీ టెక్నికల్ హెడ్‌కు సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. అయితే, తాజాగా మరోసారి సమన్లు పంపారు. విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అయితే వీరిద్దరూ పోలీసులతో టచ్‌లో లేరని సమాచారం.
కాగా, వచ్చే ఏడాది జవవరి 19 నుంచి 21 వరకు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో కోల్డ్ ప్లే కార్యక్రమం జరగనుంది. బ్రిటిష్ రాక్‌బ్యాండ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కన్సర్ట్కు అనూహ్య స్పందన వస్తోంది. దీంతో బ్లాక్‌లో ఈ ప్రోగ్రామ్ టికెట్ల విక్రయం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. న్యాయవాది అమిత్ వ్యాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.2,500 ఉండే కోల్డ్‌ప్లే టికెట్ ధరను థర్డ్ పార్టీ ద్వారా ఏకంగా రూ.3 లక్షలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అభిమానులను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వీరిపై కేసు నమోదు చేయాలని కోరారు. న్యాయవాది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగానే బుక్‌మైషో కంపెనీ సీఈవోతోపాటు కంపెనీ టెక్నికల్ హెడ్‌కు సమన్లు పంపారు.
మరోవైపు ఈ ఆరోపణలపై బుక్‌మై షో వివరణ ఇచ్చింది. అనధికారికంగా టికెట్లు విక్రయించిన వారితో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. కోల్ట్ ప్లే కన్సర్ట కోసం సెప్టెంబర్ 22న బుక్‌మైషోలో టికెట్ విక్రయాలు ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ సంగీత కచేరీకి అనూహ్య స్పందన వచ్చినట్లు పేర్కొంది. బుకింగ్స్ ప్రారంభమైన రోజే ఏకంగా 1.2 మిలియన్ల మంది టికెట్ బుకింగ్ కోసం లాగిన్ అయినట్లు వివరించింది. దీంతో ప్రతి అభిమానికీ టికెట్లు అందాలనే ఉద్దేశంతో ఒక్కో వినియోగదారుడు 4 టికెట్లు మాత్రమే కొనుగోలు చేసేందుకు పరిమితి విధించినట్లు వివరణ ఇచ్చింది.
Also Read..
Mithun Chakraborty | మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
Khammam | వైద్యం వికటించి మహిళ మృతి.. హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన
Harish Rao | కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు పొందిన గొప్ప కార్యక్రమాన్ని గాలికొదిలేశారు: హరీశ్ రావు