రిజర్వేషన్లపై బీహార్ హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం
విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర జనాభా దామాషా ప్రకారం బీహార్ రాష్ట్రం 65 శాతానికి పెంచిన రిజర్వేషన్లను పాట్నా హైకోర్టు కొట్టివేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ పేర్కొంది.
- సుప్రీం కోర్టులో జస్టిస్ ఈశ్వరయ్య పిటిషన్
న్యూఢిల్లీ: విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర జనాభా దామాషా ప్రకారం బీహార్ రాష్ట్రం 65 శాతానికి పెంచిన రిజర్వేషన్లను పాట్నా హైకోర్టు కొట్టివేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ పేర్కొంది. ఈ మేరకు పాట్నా హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీ ఈశ్వరయ్య సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పాట్నా హైకోర్టు ఆదేశాలు ఆర్టికల్ 14, 15, 16 కింద సమానత్వ నిబంధనను ఉల్లంఘించినట్టుగా ఉందని ఆయన ఆరోపించారు.
కొవిడ్‌తో ప్రతివారం 1,700 మంది మృతి
- మహమ్మారి ఇంకా ముగియలేదు: డబ్ల్యూహెచ్‌వో
న్యూఢిల్లీ: యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ కరోనా బారిన పడ్డ వేళ కొవిడ్-19 ఇంకా అంతం కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాల ప్రజలను హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల ప్రతి వారం 1,700 మంది మృత్యువాత పడుతున్నారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో టీకా వేయించుకోవడం, మాస్క్ ధరించడం, పరీక్ష చేయించుకోవడం లాంటి ప్రాథమిక ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించింది. కేపీ.3, ఎల్బీ.1 వేరియంట్లు పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
ముస్లిం వివాహ చట్టం రద్దుకు అస్సాం ఆమోదం
గువాహటి: ముస్లిం వివాహాలు, విడాకుల రిజిస్ట్రేషన్ చట్టం, నిబంధనలు, 1935ను రద్దు చేసేందుకు అస్సాం క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. కొన్ని పరిస్థితుల్లో వివాహ అర్హత వయసు కన్నా తక్కువ వయసుగల వారికి పెండ్లి చేయడానికి ఈ చట్టం అనుమతి ఇస్తున్నది. వివాహం, విడాకుల రిజిస్ట్రేషన్‌లో సమానత్వాన్ని తీసుకురావడానికే ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును రానున్న వర్షాకాల సమావేశాల్లో శాసన సభలో ప్రవేశపెడతామని చెప్పారు.
పాముకాటుకు విరుగుడుగా రక్తాన్ని పల్చబరిచే మందు
న్యూఢిల్లీ, జూలై 18: సాధారణంగా రక్తాన్ని పల్చబరిచేందుకు వాడే ‘హిపారిన్’ ఔషధం.. పాము కాటుకు విరుగుడుగా పనిచేస్తుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. హ్యూమన్ ట్రయల్స్ తర్వాత, నాగు పాము కాటుకు సైతం ఈ ఔషధం అత్యంత చౌకైన, సురక్షితమైన, ప్రభావంతమైనదిగా సైంటిస్టులు గుర్తించారు. హిపారిన్ సహా రక్తాన్ని పలుచగా మార్చే ఇతర ఔషధాలతో సైంటిస్టులు.. మనుషులు, ఎలుకల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఆ ఔషధాలు.. నాగు పాము కాటుతో ఏర్పడే ‘నెక్రోసిస్’ను ఆపగలవని ‘సైన్స్ ట్రాన్స్లేషన్ మెడిసిన్’ జర్నల్ కథనం పేర్కొన్నది.
దేశంలో నిమిషానికి 3 బాల్య వివాహాలు
న్యూఢిల్లీ, జూలై 18: మన దేశంలో ప్రతి నిమిషం ముగ్గురు బాలికలకు బలవంతంగా వివాహాలు జరుగుతున్నాయి. ‘ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్’ టీమ్ తాజా అధ్యయనంలో ఈ దిగ్భ్రాంతికరమైన విషయం వెల్లడైంది. వాస్తవానికి దేశంలో జరుగుతున్న బాల్యవివాహాల్లో చాలా తక్కువ మాత్రమే ఎన్సీఆర్బీ దృష్టికి వస్తున్నాయి. ఉదాహరణకు 2022 లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా రోజుకు సగటున 3 బాల్యవివాహాల కేసులు మాత్రమే నమోదయ్యాయి. కానీ, అప్పట్లో ఈ సగటు 21కిపైగానే ఉన్నట్టు ‘ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్’ టీమ్ పేర్కొన్నది. 2011 జనాభా లెక్కలతోపాటు ఎన్సీఆర్బీ, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21) డాటాను ‘ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్’ టీమ్ విశ్లేషించింది.
మూఢనమ్మకాలు, క్షుద్రవిద్యల నిరోధానికి చట్టం తేవాలి
న్యూఢిల్లీ: సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలు, క్షుద్రవిద్యలను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో ఒక పిల్ దాఖలైంది. కేవలం మూఢ నమ్మకాల వల్ల ఇటీవల యూపీలోని హాథ్రాస్ లాంటి ఘటన చోటుచేసుకుని తొక్కిసలాటలో 121 మంది మరణించారని పిల్లో పేర్కొన్నారు. అలాగే అతీంద్రీయ శక్తులు వస్తాయన్న మూఢ నమ్మకంతో 2018లో ఢిల్లీలోని బురారీలో 11 మంది సభ్యులున్న కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.
డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్?
చెన్నై: తమిళనాడు యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ త్వరలోనే ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తనను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని తన తండ్రి ఎంకే స్టాలిన్‌ని ఉదయనిధి కోరినట్టు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి పని భారం తగ్గడానికి కూడా ఇది దోహదపడుతుందని డీఎంకే వర్గాలు చెప్తున్నాయి. స్టాలిన్ వచ్చే నెల 22న అమెరికాకు వెళ్తున్నారు. అప్పటిలోగానే ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

