Bihar Cabinet : బిహార్‌లో సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా అనంతరం సామ్రాట్ చౌదరి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. బీజేపీ నుంచి సామ్రాట్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్ డిప్యూటీ సీఎంలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. గత నెలలోనే బీజేపీ, జేడీయూ ఆధ్వర్యంలో ఎన్డీయూ కూటమి నుంచి ప్రభుత్వ ఏర్పాటు పూర్తికాగా, ఇప్పుడు మంత్రివర్గ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది.
మే 7, గురువారం మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నట్లు తెలుస్తోంది. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం బిహార్ రాజధాని పాట్నాలోని ప్రఖ్యాత గాంధీ మైదాన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి, ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు కేటాయిస్తారు అనే ఆసక్తి నెలకొంది. నిబంధనల ప్రకారం బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రితో కలిసి 36 మందికి మంత్రులుగా అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం.. బీజేపీకి 12 మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయి. అలాగే, కూటమిలో కీలక పార్టీ అయిన జేడీయూకు 11 మంత్రి పదవులు, రామ్ విలాస్‌కు చెందిన ఎల్జేపీకి 2 పదవులు, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం పార్టీలకు చెరో మంత్రి పదవికి అవకాశం ఉంది.
ఇంకో ఆరు మంత్రి పదవులకు అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఆ పదవుల్ని మాత్రం భర్తీ చేయడం లేదు. తర్వాతి మంత్రివర్గ విస్తరణలో ఆరు పదవుల్ని భర్తీ చేస్తారు. జేడీయూలో కీలక నేతలైన శ్వేతా గుప్తా, భగవన్ కుష్వాహా, రత్నేష్ సదా, షీలే మండల్, బూలో మండల్లకు పదవులు ఖాయంగా కనిపిస్తోంది. మంత్రివర్గ ఏర్పాటుపై ఇటీవల బిహార్ సీఎం సామ్రాట్ చౌదరి.. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. మంత్రివర్గం చర్చించి, ఆయన ఆమోదం తీసుకున్నారు. బిహార్‌లో ఎన్డీయే కూటమి 201సీట్లు కలిగి ఉంది. ఇందులో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి 88 సీట్లు, జేడీయూకు 85 సీట్లున్నాయి.