బెంగళూరు: భారతరత్న, ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావుకు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్)కు సంబంధించిన నోటీస్ జారీ అయ్యింది. ఆయన పేరు ముందున్న ‘ప్రొఫెసర్’ అనే పదం ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లో అదనంగా ‘ఎఫ్’ ఉండటంతో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. (Scientist CNR Rao) రసాయన శాస్త్రంలో అత్యంత క్లిష్టమైన అంశాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు, కర్ణాటక రాజధాని బెంగళూరులో నివసిస్తున్నారు. అయితే ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఆయన పేరులో వ్యత్యాసాన్ని ఎన్నికల అధికారులు గుర్తించారు. పాత ఓటర్ల జాబితాలో ఆయన పేరు ‘Prof CNR Rao’ అని ఉండగా, సవరించిన జాబితాలో అదనంగా ఒక ‘f’ అక్షరం చేరి ‘Proff CNR Rao’ అని నమోదైంది.
ఈ నేపథ్యంలో శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావుకు ‘సర్’ నోటీస్ జారీ అయ్యింది. ఆయన పేరులోని వ్యత్యాస్యంపై విచారణ కోసం బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సమీపంలోని కేంద్రానికి హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. అయితే దీనిపై వివాదం చెలరేగడంతో ఈసీ స్పందించింది. ఆ కేంద్రంలోని ఎన్నికల అధికారుల ముందు సైంటిస్ట్ సీఎన్ఆర్ రావు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎన్నికల అధికారులు ఆయన ఇంటికి వెళ్లి అవసరమైన ధృవీకరణ ప్రక్రియను చేపడతారని పేర్కొంది.

Harekala Hajabba
మరోవైపు ఓటర్ల జాబితా వివరాల్లో పేరు సరిపోలకపోవడం వల్ల సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన హరేకళ హజబ్బకు కూడా ‘సర్’ నోటీసు జారీ అయ్యింది. దీనిపైనా విమర్శలు రావడంతో కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) స్పందించారు. ఆ సమస్య పరిష్కారమైందని స్పష్టం చేశారు. పలు రాష్ట్రాలకు చెందిన సాధారణ ప్రజలతోపాటు ప్రముఖ వ్యక్తుల పేర్లు ‘సర్’ ప్రక్రియలో ఓటరు జాబితాల నుంచి మాయం కావడం, నోటీసులు అందడంపై ఈసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.