Air hostess | ముంబై, సెప్టెంబర్ 8: అందరూ చూస్తుండగానే విమానంలో ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ఆమెకు ముద్దు పెట్టడానికి యత్నించిన బంగ్లాదేశ్ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. మస్కట్ నుంచి ముంబై మీదుగా ఢాకాకు వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మరో అరగంటలో విమానం ముంబై చేరుతుందనగా ఢాకాకు వెళ్తున్న బంగ్లాదేశ్ ప్రయాణికుడు మహమ్మద్ దులాల్ ఎయిర్ హోస్టెస్‌ను కౌగిలించుకుని ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ చర్యను తప్పుబట్టిన తోటి ప్రయాణికులతో అతడు గొడవకు దిగాడు. విమాన కెప్టెన్ రెడ్ వార్నింగ్ కార్డు చూపి అతడిని దురుసు ప్రవర్తన గల ప్రయాణికుడిగా ప్రకటించారు. ముంబైలో భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.